తెలుగు భాష.. సంస్కృతి.. విధానాలు.. ఓటు బ్యాంకు కాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. “కొందరు తెలుగును కూడా ఓటు బ్యాంకు కోసం వాడుకునే రోజులు చూ శాం. కానీ, ప్రజలు చాలా గొప్పవారు. వారి భాషను వారే కాపాడుకున్నారు. తెలుగు తేనెలూరడమే కాదు.. శుశ్రావ్యమైన సంగీత ధ్వనిలా కూడా ఉంటుంది“ అని పేర్కొన్నారు. విజయవాడలో ప్రపంచ తెలుగు రచ యితల ఆరో మహాసభలు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమంలో విశిష్ఠ అతిధిగా పాల్గొన్న జస్టిస్ ఎన్వీరమణ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. తెలుగును తృణీకరించడం ద్వారా ఎంత తప్పు చేస్తున్నామో అందరూ ఆలోచించుకోవాలని సూచించారు. అనేక మంది పెద్దలు మనకు వారసత్వంగా ఇచ్చిన తెలుగు భాషను ప్రతి ఒక్కరూ కాపాడుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. `భావ వ్యక్తీకరణ భాష ముఖ్యం. కానీ, నేడు ఇంగ్లీష్ మాట్లాడడాన్ని ఏదో గొప్పగా భావిస్తున్నారు. ఇది సరికాదు. పాఠశాలల్లోనే పునాదులు బలంగా పడాలి“ అని నొక్కి చెప్పారు.
కాగా.. జస్టిస్ రమణ ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ.. ఎవరినీ ఉద్దేశించి ఆయన అనకపోయినా.. వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం తీసేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అప్పట్లోనే జస్టిస్ ఎన్వీ రమణ నుంచి అనేక మంది మేధావులు కూడా.. వైసీపీ ప్రభుత్వానికి అనేక సూచనలు చేశారు. తెలుగు మాధ్యమం తీసేయవద్దని సూచించారు.
కావాలంటే ఆంగ్ల మాధ్యమాన్ని మరో సబ్జెక్టుగా బోధించాలని కూడాహితవు పలికారు. కానీ, ఆనాడు వైసీపీ వినిపించుకోలేదు. బహుశ.. ఇప్పుడు ఆ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే తెలుగు .. ఓటు బ్యాంకు కాదని వ్యాఖ్యానించి ఉంటారని సభికులు చర్చించుకోవడం గమనార్హం.