సాఫీగా సాగిపోతున్న దాన్ని ఏదోలా కెలికి.. లేని వివాదాన్ని నెత్తి మీదకు తెచ్చుకునే అలవాటు కొన్ని కంపెనీలకు ఉంటుంది. ఈ మధ్యన ఇలాంటి పనే చేసిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తాము కొత్త గోప్యతా (ప్రైవసీ) విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పి.. అందుకు అంగీకరించాలంటూ కండీషన్లు పెట్టటమే కాదు.. అందుకు ఓకే చెప్పకుంటే తాము సేవల్ని నిలిపివేస్తామన్న కరకు కండిషన్ పెట్టింది.దీనిపై రేగిన దుమారం అంతా ఇంతా కాదు. అప్పటివరకు వాట్సాప్ లేకుండా నిమిషమైనా గడుస్తుందా? అన్న ఆలోచన స్థానే.. టెలిగ్రామ్.. సిగ్నల్ లాంటి కొత్త సేవల్ని వినియోగించటం షురూ చేశారు.
అంతేకాదు.. ప్రైవసీ పాలసీకి ఓకే చెప్పకుంటే సేవలు నిలిపివేయటం కాదు.. మేమే నిన్న వదిలేస్తామంటూ ప్రజల నుంచి వచ్చిన స్పందనతో వాట్సాప్ సైతం వెనక్కి తగ్గింది. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. కేంద్రం సైతం వాట్సాప్ తీరుపై తన అసంత్రప్తిని వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే..దీనికి సంబంధించి కర్మన్య సింగ్ సరీన్ అనే వ్యక్తి వాట్సాప్ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
వాట్సాప్ అనుసరిస్తున్న ప్రైవసీ పాలసీ ఐరోపాలో ఒకలా.. భారత్ లో మరోలా ఉందని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని కోరారు. తాజాగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. డబ్బు కంటే కూడా వ్యక్తిగత ప్రైవసీకి ప్రజలు ఎక్కువ విలువ ఇస్తారని.. అందువల్ల వారి ప్రైవసీని పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందంటూ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. కొత్త పాలసీతో ప్రవైసీ కోల్పోతామని ప్రజల్లో ఆందోళన నెలకొందని.. వాట్సాప్ లో పంపే మెసేజ్ లు ఫేస్ బుక్ తో పంచుకుంటారేమోనని భయపడుతున్నట్లుగా వ్యాఖ్యానించింది.
ఈ సందర్భంగా వాట్సాప్ పై చురకలు వేసింది అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం. ‘మీది రెండు.. మూడు ట్రిలియన్ల విలువైన కంపెనీ కావొచ్చు. కానీ ప్రజలకు వారి ప్రైవసీ అంతకంటే ఎక్కువ విలువైనది. అందువల్ల వారి వ్యక్తిగత గోప్యతను పరిరక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. తాజాగా దాఖలైన పిటిషన్ పై స్పందన తెలియజేయండి’ అంటూ వాట్సాప్ తో పాటు కేంద్రానికి నోటీసు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.