హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ తో కోట్లాదిమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం ఓవైపు నటుడిగా, నిర్మాతగా సత్తా చాటుతూనే మరోవైపు వ్యాపార రంగంలో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మల్టీప్లెక్స్, రెస్టారెంట్స్, క్లాతింగ్ వంటి పలు రకాల వ్యాపారాల్లో తనదైన ముద్ర వేసిన మహేష్.. తగ్గేదే లే అంటూ మరో కొత్త బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
భారతదేశంలోని న్యూట్రాస్యూటికల్ పరిశ్రమలో ప్రముఖ బ్రాండ్ అయిన `ఫిట్డే` లో మహేష్ బాబు భారీగా పెట్టుబడులు పెట్టాడు. ఈ విషయాన్ని సదరు కంపెనీ తమ వెబ్సైట్లో అధికారికంగా వెల్లడించింది. పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన స్నాకింగ్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఫిట్డే మిషన్లో మహేష్ బాబు భాగం అయ్యారు.
మల్టీగ్రెయిన్ చిప్స్, మిల్లెట్ బార్లు, ప్లాంట్-బేస్డ్ ప్రొటీన్లు మరియు డైటరీ సప్లిమెంట్లతో సహా అనేక రకాల ఉత్పత్తులతో ఫిట్డే ప్రజాదరణ పొందింది. అలాగే ఇప్పటికే దేశవ్యాప్తంగా 10,000 స్టోర్లలో ఫిట్డే అందుబాటులో ఉంది. ఇక మహేష్ బాబు ఎంట్రీతో ఫిట్డే తన రిటైల్ ఉనికిని మరింత విస్తరించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
కాగా, మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళితో తన తదుపరి సినిమాను చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వస్తున్న తొలి ప్రాజెక్ట్ ఇది. ఈ చిత్రాన్ని సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడెక్షన్, కాస్టింగ్ పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.