కడప అన్నంతనే.. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా అభివర్ణిస్తారు. అధికారం ఉన్నా లేకున్నా.. కక్షలు.. కారప్పణ్యాలు ఎన్ని ఉన్నా.. వైఎస్ కుటుంబానికి తిరుగులేని రక్షణ ఉంటుందని చెబుతారు. వారి వైపు కన్నెత్తి చూసేందుకు సైతం జంకుతారు. అలాంటిది కడప జిల్లాలో.. అందునా వైఎస్ వివేక సొంతూరులో.. ఆయన సొంతింట్లో నిద్ర పోతుంటే.. లోపలకు వెళ్లి దారుణంగా హతమార్చటం నమ్మశక్యం కానిదైతే.. అంత దారుణ ఘటన జరిగి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్క నిందితుడి అరెస్టు జరగకపోవటం మరో విచిత్రం.
ఓపక్క తన పెద్దనాన్న కొడుకు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటమే కాదు.. ప్రజారంజకంగా పాలిస్తున్నఅధినేతగా పాలిస్తూ.. కోట్లాది మంది సమస్యల్ని తన సొంత సమస్యలుగా ఫీల్ అవుతున్న పేరును సొంతం చేసుకున్నారు. అలాంటిది.. సొంత బాబాయ్ ను ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేసిన విషయాన్నిసీఎం జగన్ ఎంత సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికి న్యాయం కోసం ప్రతి గడపా ఎక్కతున్నట్లుగా జగన్ సోదరి సునీత పేర్కొనటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. తాజాగా ఆమె ఢిల్లీలోని మీడియాతో తొలిసారి మాట్లాడారు. తన తండ్రి హత్య జరిగిన రెండేళ్ల వరకూ మీడియా సమావేశాన్ని నిర్వహించిన ఆమె.. మొదటిసారి ఆ పని చేశారు. ఈ సందర్భంగా నోట్ చేసుకోవాల్సిన చాలా పాయింట్లను ఆమె చెప్పారు.అందులో ముఖ్యమైనవి చూస్తే.
- నా పేరు డాక్టర్ సునీత. మా నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి. ఆయనను దారుణంగా హత్య చేసి రెండేళ్లు దాటిపోయింది. ఇప్పటిదాకా న్యాయం జరగలేదు. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. నేను ఎక్కని గుమ్మంలేదు. తట్టని తలుపు లేదు. ఏం చేస్తే న్యాయం జరుగుతుందో కూడా తెలియడంలేదు.
- రాజకీయ కారణాల వల్లే (పొలిటికల్ మర్డర్) మా నాన్న మర్డర్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ దోషులను పట్టుకోలేకపోయారు. మా నాన్న ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్కు చిన్నాన్న. ఆయన సమితి ప్రెసిడెంట్ నుంచి మంత్రి వరకు అనేక పదవులు నిర్వహించారు. మా నాన్న కేసులోనే ఇదీ పరిస్థితి! ఇక సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుంది?
- మా నాన్న వాళ్లు నలుగురు సోదరులు, ఒక సోదరి. వారిలో ఒకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మాది పెద్ద కుటుంబం. మా నాన్నకు ప్రయాణం చేయడం ఇష్టం. హాకీ, టెన్నిస్ అంటే ఇష్టం. కానీ… ప్రజల సేవలోనే ఎక్కువ సమయం గడిపారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మారు. మమ్మల్నీ అలాగే పెంచారు.
- ఆయన సౌమ్యుడని అందరూ అంగీకరిస్తారు. ఎవ్వరైనా కలిసి సహాయం కోరేంతగా అందుబాటులో ఉంటారు. అలాంటి మా నాన్నను చంపేశారు. ఈ హత్య జరిగి రెండేళ్లు దాటింది. రెండేళ్ల కాలం తక్కువ సమయం కాదు. అయినప్పటికీ… మా నాన్నను ఎవరు చంపారో ఇంకా గుర్తించలేదు.
- సెలవుల్లో నేను పులివెందులకు వెళ్లేదానిని. ఫ్యాక్షన్ నేపథ్యంతో జరిగే హత్యల గురించి వింటూ పెరిగాను. కానీ… ఇప్పుడు పరిస్థితులు మారాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి అక్కడి పరిస్థితులను మార్చేందుకు, అభివృద్ధి చేసేందుకు చాలా కృషి చేశారు.
- మా తండ్రి హత్య విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందామని ఒక సీనియర్ అధికారితో మాట్లాడితే… ‘కర్నూలు, కడపలో ఇలాంటి హత్యలు మామూలే కదా!’ అని తేలిగ్గా మాట్లాడారు. ఇది విని నాకు చాలా బాధ కలిగింది. కోపం కూడా వచ్చింది. అయితే… ఆయన అన్నదీ నిజమేనేమో.. లేకపోతే నాన్నను ఇంత ఘోరంగా చంపేవారు కాదు కదా అనిపించింది.- పిల్లలు ఒక తప్పు చేస్తే… మళ్లీ అదే తప్పు చేయకుండా దండిస్తాం. అలాగే… హంతకులను శిక్షించకపోతే మళ్లీ హత్యలు చేస్తూ పోతారు. హంతకులను స్వేచ్ఛగా వదిలేస్తే, వారు హాయిగా తిరుగుతుంటే… బాధితులు రోదిస్తారు అనేది ఒక న్యాయ సూత్రం.
- ఈ పోరాటం మొదలుపెట్టిన నాకు బెదిరింపులు వచ్చాయి. నాకు బాగా తెలిసిన వాళ్లు ఈ విషయంలో నాకు జాగ్రత్తలు చెప్పారు. ‘‘నువ్వు డాక్టర్వు. ఇద్దరు పిల్లలున్నారు. వారి బాగోగులు చూసుకో! పోయిన వాళ్లు ఎలాగూ పోయారు! ఇంతటితో వదిలెయ్. అలా కాకుండా పోరాడుతుంటే… దాని ప్రభా వం మీ పిల్లలపై పడుతుంది’’ అని సున్నితంగా హెచ్చరించారు.
- నేను ఏం చేస్తే కరెక్ట్ అని ప్రశ్నించుకున్నాను. నా స్వార్థం చూసుకుని ఇంతటితో వదిలేయడమా… లేక, ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొని నాన్న హంతకులకు శిక్ష పడేలా చేయడమా? ఒకరిని చంపడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలేయవద్దు. నేనే మౌనంగా ఉంటే… సాక్షుల పరిస్థితి ఏమిటి? వారికి తెలిసిన విషయాలను చెప్పేందుకు ఎలా ముందుకు వస్తారు?
- నాన్న హత్య జరిగి రెండేళ్లయింది. దర్యాప్తు జరుగుతూనే ఉంది. న్యాయం కోసం ఇంకా ఎన్నాళ్లు వేచి చూడాలి? శ్రీనివాసరెడ్డి అనే సాక్షి/అనుమానితుడు సందేహాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు. అతనిది ఆత్మహత్య అని మొదట చెప్పారు. కానీ… పోస్టుమార్టం రిపోర్ట్ చూస్తే హత్య అని నాకు అనిపిస్తోంది. ఇంకా ఎంత మంది సాక్షులకు హాని జరుగుతుందో అనే భయం కలుగుతోంది. ఇప్పుడు పులివెందులలో వివేకానందరెడ్డి గురించి బహిరంగంగా మాట్లాడలేకపోతున్నారు. భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో… సాక్ష్యం చెప్పేందుకు ఎవరైనా ముందుకు వస్తారా లేదా అనే సందేహం కలుగుతోంది.- సొంత ఊరిలో, సొంత ఇంట్లో, ఎలాంటి భద్రత అక్కర్లేదనే భరోసాతో ఉన్న 68 ఏళ్ల వ్యక్తిని… తనను తాను కాపాడుకోలేని వృద్ధుడిని చంపడం క్షమించాల్సిన విషయం కాదు. ఈ పని చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టవద్దు. అందుకే… ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నా.
- ఈ పోరాటంలో మాకు మనశ్శాంతి కరువైంది. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించి ఏడాది పూర్తయింది. విచారణ ఎప్పుడు పూర్తవుతుందో, చార్జిషీటు ఎప్పుడు వేస్తారో తెలియదు. ఇదంతా పూర్తయి న్యాయం జరిగినప్పుడే… మాకు మనశ్శాంతి.
- నేనూ, షర్మిలా కలిసి పెరిగాం. ఇద్దరం చాలా సన్నిహితులం. షర్మిల చాలా స్ట్రాంగ్ లేడీ. కరెక్ట్ అనుకున్న దానివైపు గట్టిగా నిలబడతారు. నాన్న హత్య విషయంలో తప్పు జరుగుతోందని ఆమెకూ తెలుసు. నిజం బయటికి రావాలనే అభిప్రాయంతో ఉన్నారు. నాకు ఆమె మద్దతు ఉంది.- ఏపీలో ఉన్నది జగన్ ప్రభుత్వమే. సమస్య ఏమిటని అడుగుతున్నారు. ఇది మంచి ప్రశ్న. ఈ ప్రశ్నను జగన్ ప్రభుత్వాన్ని.. దర్యాప్తు సంస్థలనే అడగాలి. నాకైతే సమాధానం లభించలేదు. జవాబు దొరికి ఉంటే ఇక్కడిదాకా రావాల్సిన అవసరమే ఉండేది కాదు. మా వాళ్ల ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ దోషులు దొరకలేదు.
- హత్య ఎవరు చేశారో దర్యాప్తు సంస్థలు తేల్చాలి. సాక్ష్యాలు కావాలి. ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే… సాక్ష్యాలు ఎలా లభిస్తాయి? రెండేళ్లలో ఒక్క అరెస్టు కూడా జరగలేదు. వైఎస్ కుటుంబానికి కంచుకోటలాంటి పులివెందులలోనే, సొంత ఇంట్లోనే మా నాన్న హత్య జరిగింది. ఇది ఎవరు చేయగలరు? నాకు సమాధానం కావాలి. దోషులు ఎందుకు దొరకలేదో తెలియాలి.
- నాకు తెలిసినంత వరకూ… ఇది పొలిటికల్ మర్డర్. ఇది ఎందుకు జరిగిందో, ఎవరు చేశారో, ఈ దర్యాప్తు ఎందుకు కొలిక్కి రాలేదో … మాకూ, మా నాన్నను ఇష్టపడే వారికీ తెలియాలి. మాకు న్యాయం జరగడమే ముఖ్యం. చాలా ప్రయత్నాల తర్వాత కూడా సమాధానాలు రానందునే మీడియా ముందుకు వచ్చారు. ఇంకా ఏదైనా ఒత్తిడి తెస్తే కేసు ముందుకు వెళుతుందా? ఈ విషయంలో నాకు మీడియా సహకారం కూడా కావాలి.
- ఈ హత్య జరిగిన తర్వాతి నుంచి తరచూ ఢిల్లీకి వస్తూనే ఉన్నాను. దర్యాప్తు సంస్థలను కలిసి అవసరమైన సమాచారం ఇస్తున్నాను. ప్రధాని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి… ఇలా అనేక కార్యాలయాలకు వెళ్లాను. ఒకరకంగా చెప్పాలంటే… ఒక వరదలా కమ్యూనికేషన్స్ చేశాను.