తన తండ్రి, దివంగత నేత వైఎస్ వివేకా హత్య కేసు నిందితులకు శిక్ష పడాలని కోరుతూ ఆయన తనయురాలు సునీత రెడ్డి ఐదేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన సోదరుడు సీఎం జగన్ తో పాటు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై కూడా ఆమె సంచలన విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన సోదరి వైఎస్ షర్మిలకు మద్దతిస్తున్న సునీత..తాజాగా పులివెందులలో ఆమె తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ షర్మిలను అఖండ మెజారిటీతో గెలిపించి తనకు న్యాయం చేయాలని ప్రజలను కోరుతున్నారు. వైెఎస్ సునీత ప్రచారానికి భారీ స్పందన వస్తోంది.
కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మద్దతుగా వైఎస్ సునీత పులివెందులలో ఇంటింటి ప్రచారం ఈ రోజు మొదలుబెట్టారు. నలభై ఏళ్లుగా కడప ప్రాంత ప్రజలకు వివేకా సేవ చేశారని సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం షర్మిల, తాను పోరాడుతున్నామని, షర్మిలను గెలిపించాలని ప్రజలను ఆమె కోరారు.
ప్రజల కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని, అందరిలోనూ చెప్పుకోలేని బాధ ఉందని చెప్పుకొచ్చారు.
పులివెందుల ప్రజలతో పాటు తాను కూడా ఐదేళ్లుగా పడుతున్న బాధకు మే 13ను ముగింపు చెప్పాలని ప్రజలను కోరారు. తన తండ్రిని దారుణంగా హతమార్చేందుకు ప్రేరేపించిన వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కొందరు వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి అవమానిస్తున్నారని, వారిని ప్రజలు ఓడించి ఇంటికి పంపాలని కోరారు.