ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు జరిగిన ఈ హత్య కలకలం రేపింది. అయితే, వివేకా వంటి హై ప్రొఫైల్ వ్యక్తి హత్య జరిగి రెండేళ్లు పూర్తయినా…అసలు దోషులెవరన్నది తేలలేదు. దీంతో, ఈ కేసు విచారణపై వివేకా కుమార్తె సునీతారెడ్డి పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఈ కేసు విషయంపై నేరుగా ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి వెళ్లిన సునీత…అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి తమ కుటుంబ సభ్యుల్లో కొందరిపై అనుమానాలున్నాయని వెల్లడించారు. అంతేకాదు, మీడియా ముందు వారి పేర్లను వెల్లడించి సంచలనం రేపారు.
తన తండ్రి హత్యకేసులో 15 మంది అనుమానితుల జాబితాను దర్యాప్తు అధికారులకు అందజేసినట్టు వెల్లడించారు. ఆ అనుమానితుల్లో ఎంపీ అవినాశ్ రెడ్డి , భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డిల పేర్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ జాబితాలో మొదటిపేరు వాచ్ మన్ రంగన్న అని, అతని వ్యవహార శైలి ఎంతో అనుమానాస్పదంగా ఉందన్నారు.
ఆ తర్వాత పేరు ఎర్ర గంగిరెడ్డి అని, ఆయన తన తండ్రికి ఎంతో సన్నిహితుడని, హత్య జరిగిన తర్వాత ఘటన స్థలంలో మరకలు శుభ్రం చేయించింది ఆయనే అని ఆరోపించారు. పరమేశ్వర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డిలకు సంబంధించి అనేక సందేహాలున్నాయని అన్నారు.
వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి సహా పలువురి పేర్లను తాను హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నానని సునీత మీడియాకు వెల్లడించారు. వైఎస్ షర్మిలతోపాటు మరికొందరు కుటుంబసభ్యుల మద్దతు తమకు ఉందని సునీత అన్నారు. ఈ సందర్భంగా జగన్ పై సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ సీఎంగా ఉన్నా కేసు విచారణలో జాప్యం ఎందుకు జరుగుతోందని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సునీత షాకింగ్ సమాధానమిచ్చారు. ఈ కేసు విచారణ ఎందుకు ముందుకెళ్లడం లేదో జగన్ నే అడిగితే బాగుంటుందని సునీతా చెప్పారు. కేరళకు చెందిన ప్రముఖ హక్కుల కార్యకర్త జోమున్ పుతెన్ పురక్కల్ ను కలిశానని, సాక్ష్యాధారాల సేకరణలో దర్యాప్తు సంస్థకు ఎలా తోడ్పడాలన్న విషయమై చర్చించామని చెప్పారు.
ఇప్పటి వరకు ఈ కేసులో దోషులను పట్టుకోలేదని, కడప, కర్నూల్లో ఇలాంటి ఘటనలు సాధారణం అని ఓ ఉన్నతాధికారి తనతో చెప్పడం బాధాకరమన్నారు. ఈ కేసు విషయంలో తన పోరాటం ఆపాలని, లేకుంటే తన పిల్లలపై ప్రభావం పడుతుందని కొంతమంది సూచించారరని పేర్కొన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రికి బాబాయి అంతటి వ్యక్తికే ఇలా జరిగితే… సామాన్యుల పరిస్థితి ఏంటి? అని సునీతా ప్రశ్నించారు.
ఇప్పటికే ఈ కేసులో ఓ నిందితుడు మరణించాడని, విచారణ ఆలస్యమైతే మిగతా సాక్షులు కూడా ముందుకు రారని అనుమానం వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఇంకెంత కాలం నిరీక్షించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ఒక్కరినీ అరెస్ట్ చేయకపోవడం విచారణపై సందేహం కలుగుతోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హంతకులను ఇంతవరకూ పట్టుకోకపోవడం ఆందోళనకరమని, సీబీఐ దర్యాప్తులోనూ పురోగతి లేకపోవడం విచారకరమని అన్నారు. సాక్ష్యాలు తారుమారవుతాయోననే సందేహం కలుగుతోందని సునీతా రెడ్డి అన్నారు