అక్కినేని హీరో సుమంత్ రెండో పెళ్లి అంటూ ఇటు సోషల్ మీడియాలో అటు మీడియాలో గాసిప్స్ చక్కర్లు కొడుతోన్న సంగతి తెలిసిందే. సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ టీ టౌన్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ విషయం ఆ నోట ఈ నోట పడి…చివరకు వివాదాస్పద, విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దగ్గరకు చేరింది. ఇంకేముంది, సుమంత్ తొలి సినిమాను డైరెక్ట్ చేసిన ఆర్జీవీ…అదే చనువుతో వద్దురా..సోదరా..పెళ్లంటే నూరేళ్ల మంటరా అంటూ క్లాస్ పీకాడు.
‘పెళ్లంటే పెద్ద పెంట’అంటూ ఏకంగా సుమంత్ ను ట్యాగ్ చేసి మరీ వర్మ ట్వీటడంతో ఆ పెళ్లి విషయం నిజమేనని అంతా అనుకున్నారు. ఇక, తనకు తొలి చాన్స్ ఇచ్చిన వర్మ కూడా పెళ్లికి ముందే అక్షింతలు వేసేసరికి…సుమంత్ తన రెండోపెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు. పవిత్ర అనే అమ్మాయితో తన పెళ్లి అంటూ మీడియాలో వచ్చిన వార్తలను సుమంత్ ఖండించాడు. ఆ పెళ్లి వార్తలన్నీ….గాలి వార్తలేనని, తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చేశాడు.
ఇక, సోషల్ మీడియాలో వైరల్ అయిన ‘సుమంత్ వెడ్స్ పవిత్ర’ వెడ్డింగ్ కార్డ్ పై కూడా సుమంత్ స్పందించాడు. అది తన అప్ కమింగ్ మూవీ కోసం డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డ్ అని, ఎలాగోలా అది సెట్స్ నుంచి లీకైందని చెప్పాడీ అక్కినేని వారబ్బాయి. పెళ్లి, విడాకులు వంటి కాన్సెప్ట్ తో తాను చేస్తున్న ఓ సినిమాకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఇలా వైరల్ అయిందని, త్వరలోనే ఆ సినిమా నుంచి ఓ ఆసక్తికర అప్ డేట్ ఇస్తామని చెప్పాడు సుమంత్. అయితే, ఇదంతా తన తర్వాతి చిత్రం కోసం పబ్లిసిటీ స్టంట్ కూడా అయ్యి ఉండొచ్చని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.