భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ కారణమంటూ ఆరోపణలు రావడం కలకలం రేపింది. అయితే, తనకు ఆ సూసైడ్ కు ఏం సంబంధం లేదని రాఘవ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, తాజాగా రామకృష్ణ ఆత్మహత్య వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చింది.
ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియోలో రాఘవపై చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. తన భార్యను హైదరాబాద్ తీసుకురావాలని రాఘవ అడిగాడని.. రామకృష్ణ షాకింగ్ ఆరోపణలు చేశారు. రాజకీయ, ఆర్ధిక బలంతో పబ్బం గడుపుకోవాలని చూశారని, తాను చనిపోతే తన భార్య, పిల్లలను వదిలిపెట్టరు కాబట్టే కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంటున్నామని చెప్పారు.
రాఘవ కారణంగా ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని.. రాఘవ దురాగతాలతో ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు. రాఘవ లాంటి దుర్మార్గులను రాజకీయంగా ఎదగనివ్వొద్దని కోరారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఆ వీడియో వనమా రాఘవ దౌర్జన్యాలను వెల్లడిస్తోందని, రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును టీఆర్ఎస్ పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఒక ఎమ్మెల్యే కొడుకుపై ఆరోపణలు చేసి ఒక కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నా.. ఇప్పటి వరకు అధికార పార్టీ స్పందించకపోవడం దారుణమని దుయ్యబట్టారు. ఈ ఘటనపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనపై కేసీఆర్ వెంటనే స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.