సుఖాన్ని అందరూ పంచుకుంటారు. అదేం పెద్ద విషయం కాదు. కానీ.. కష్టం వచ్చినప్పుడు మాత్రం అందుకు భిన్నంగా రియాక్టు కావాలి. ఎవరైతే కెప్టెన్ గా ఉంటారో.. వారు ఎక్కువ కష్టాన్ని తీసుకొని.. తనతో ఉండే వారి మీద తక్కువ భారం పడేలా చూడటమే అసలుసిసలు నాయకత్వం లక్షణం. కానీ.. తాజాగా గూగుల్ సీఈవో వైఖరి చూసినప్పుడు మాత్రం ఒకింత ఆగ్రహం కలిగేలా ఉందని చెప్పాలి. అమెరికాలో నెలకొన్న ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఎప్పుడూ లేని విధంగా ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యోగుల్ని లేఆఫ్ ల పేరుతో ఇంటికి పంపేస్తున్న సంగతి తెలిసిందే.
ఇలాంటి కష్టకాలంలో 2022 ఏడాది కాలానికి గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా బెట్ సీఈవోగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్ కు రూ.1850 కోట్లకు పైనే పారితోషికం అందుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది. గూగుల్ పని చేసే సగటు ఉద్యోగి వేతనంతో పోలిస్తే ఇది 800 రెట్లు ఎక్కువగా ఉండటం ఒక ఎత్తు అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత భారీ పారితోషికంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ప్రకటించిన పారితోషికంలో 218 మిలియన్ డాలర్ల విలువైన స్టాకులు ఉన్నట్లు చెబుతున్నారు. మూడేళ్ల కాలానికి ఈ స్టాక్ అవార్డును అందుకున్నట్లుగా కంపెనీ తెలిపింది. 2019లోనూ ఆయన ఇదే స్థాయిలో ప్యాకేజీ అందుకున్నారు. గడిచిన మూడేళ్లుగా పిచాయ్ 2 మిలియన్ డాలర్ల వార్షిక వేతనాన్ని తీసుకుంటున్నారు. తాజాగా మాంద్యం భయాలతో పెద్ద ఎత్తున ఉద్యోగులకు లేఆఫ్ ల్ని ప్రకటిస్తున్న వేళలో.. పిచాయ్ ఇంత భారీగా పారితోషికం అందుకోవటం చర్చనీయాంశంగా మారింది.
మాంద్యం భయాందోళనల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 12 వేల మందిని ఇంటిబాట పట్టిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. మొత్తం ఉద్యోగుల్లో ఆరు శాతం ఉద్యోగుల్ని ఇంటికి పంపిన వైనంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఓపక్క ఖర్చుల నియంత్రణ అని చెప్పి మరోవైపు ఇంత భారీ పారితోషికం ఇవ్వటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఓపక్క వేలాది మంది ఉద్యోగుల్ని తీసేసే బదులు.. తనకు వచ్చే పారితోషికాన్ని తగ్గించుకోవటం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు నిలబెట్టే వీలుందన్న వాదనను వినిపిస్తున్నారు. ఉద్యోగులు ఏమైనా ఫర్లేదు కానీ.. బాస్ ల పారితోషికాలు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉండటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.