తామున్న పార్టీలోని లోపాల్ని ఎత్తి చేపే నేతలు కొద్దిమందే ఉంటారు. అలాంటి వారు కొంత ప్రతికూలతను ఎదుర్కొన్నా.. మిగిలిన వారికి భిన్నమైన ఇమేజ్ వారికి ఉంటుంది. ఆ కోవలోకే వస్తారు ఒంగోలు వైసీపీ నేత.. ఆర్యవైశ్యుడు సుబ్బారావు గుప్తా.
నిజానికి మంత్రి బాలినేని అనుచరుడు సుభాని తన అనుచరులతో కలిసి దారుణంగా కొట్టకుంటే.. ఆయన ఎవరికీ తెలిసేవారు కాదు. కానీ.. ఆయన్ను నిర్భంధించి భౌతికదాడి చేసిన వైనం సంచలనంగా మారటమే కాదు.. ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా చేసింది. అదే సుబ్బారావు గుప్తా.. తాజాగా తమ వర్గానికి చెందిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం సంచలనంగా మారటమే కాదు.. కొత్త చర్చకు తెర తీసేలా చేసింది.
తనకు వంగవీటి రంగా అంటే ప్రాణమని చెప్పుకొచ్చారు.. ఆయన బ్రతికి ఉంటే ముఖ్యమంత్రి అయ్యుండేవారన్నారు. తనకు కాపుల్లో చాలామంది స్నేహితులు ఉన్నారని.. తనను చాలామంది సుబ్బారావు గుప్తా నాయుడు అంటారన్నారు. తాను వంగవీటి రాధాను కలిసి వచ్చానని చెప్పారు. తనపై దాడి జరిగిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారని.. ఆయన్నుకలిసేందుకు వెళుతున్నప్పుడు తన భార్య తనను అడ్డుకుందన్నారు.
‘‘జగనన్న నాకు అపాయింట్ మెంట్ ఇచ్చారు. మా ఆవిడ ఒకటే అంది. నువ్వు వెళితే నేను ఒప్పుకోను. వారే క్షమాపణలు చెప్పాలని ఆ అమ్మాయి డిమాండ్. నేను అందుకే ప్రెస్ కు చెప్పేశా. నా రెండు డిమాండ్లను ఓకే చేస్తే నేను వెళ్లి కలిసి వస్తానని. నా క్యారెక్టర్ ఏమిటో అందరికి తెలుసు. నాకు మతిస్థిమితం లేదని 151 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో ఒక్కరితోనైనా చెప్పించాలని సవాలు విసురుతున్నా. నేను ఎవరికి భయపడను’’ అని వ్యాఖ్యానించారు.
వంగవీటి రంగాపై రెక్కీ జరిగిందన్నంతనే టు ప్లస్ టు సెక్యురిటీ ఇస్తే.. ఆ సారు వద్దని వెనక్కి పంపారున్నారు. నా మీద ఏకంగా దాడి జరిగిందని.. ఇప్పటివరకు భద్రత ఏర్పాటు చేయలేదన్నారు. రెక్కీ జరిగిందనే విషయం తెలియటంతో తాను వంగవీటి రాధాను కలిశానని చెప్పారు. సుభాని అప్పులు పాలు అయ్యాడని.. వాటిని తీర్చుకోవడానికి తనను కొట్టినట్లు చెప్పారు సుబ్బారావు.
‘‘మీరు మాఫియా చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో సామంత రాజులు వచ్చారు. చిత్తూరులో మీ సామాజిక వర్గం వాళ్లనే కొట్టారు. సిగ్గు చేటు. కొట్టించుకున్న నేను హీరో అయ్యాను కొట్టిన వాడు విలన్ అయ్యాడు. నన్ను కొట్టిన వాడిని కఠినంగా శిక్షించాలి. ఏ కులం పైన దాడి జరిగినా నేను ముందు ఉండి పోరాడుతా. భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదు. నా ఇంటిపై జరిగిన దాడి విషయంలో కారు నెంబర్‌తో సహా పూర్తి ఆధారాలను పోలీసులకు ఇచ్చా. నాపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు’’ అని చెప్పారు.
ఆర్యవైశ్యులు ఎవరికీ భయపడరని.. ఒంగోలులో ముంబై మాఫియా దిగిందంటూ సుబ్బారావు గుప్తా ఆరోపించారు. ఒంగోలులో 300 మంది రౌడీషీటర్లు ఉంటే అందులో 250 మంది తనకు పరిచయమని చెప్పారు. ఒంగోలు ముంబయి మాఫియా దిగిందన్న ఆయన.. చోటా రాజన్ గ్యాంగులు దిగాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.