ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్లిన కొన్ని చోట్ల ఆయనకు నిరసన సెగ తప్పట్లేదు. ప్రస్తుతం ఆయన గోదావరిప్రాంతంలో పర్యటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సురంపాలెం ప్రాంతంలో విద్యార్థుల నుంచి నిరసన ఎదురైంది. అక్కడి పేరొందిన ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కు చెందిన విద్యార్థులు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వీడియో సోషల్ మీడియాలో నిన్నట్నుంచి వైరల్ అవుతోంది.
ఐతే నిన్న జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని ఈ రోజు ఆ కాలేజీ యాజమాన్యం కొందరు విద్యార్థులను సస్పెండ్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. సీఎం కాన్వాయ్ ముందు క్రమశిక్షణ రాహిత్యంతో ప్రవర్తించారని విద్యార్థులపై యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఐతే నిన్న వైరల్ అయిన వీడియోలో ఓ విద్యార్థి సీఎం కాన్వాయ్ దగ్గరికి విద్యార్థులు రావడం గురించి ఆసక్తికర విషయం చెప్పాడు. సీఎం ర్యాలీకి హాజరు కాకపోతే అటెండన్స్ వేయమని కాలేజీ యాజమాన్యం బెదిరించిందని.. అందుకే విద్యార్థులు అక్కడికి రావాల్సి వచ్చిందని ఆ విద్యార్థి తెలిపాడు.
కాగా, సీఎం బస్సు నుంచి దిగి ఎవరితోనో మాట్లాడుతుండగా.. విద్యార్థులు సీఎంకు వ్యతిరేకంగా, జనసేనాని పవన్ కళ్యాణ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. ‘‘బాబులకే బాబు కళ్యాణ్ బాబు’’.. ‘‘సీఎం బొక్క.. సీఎం బొక్క’’ అన్న నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఐతే దీనికి బాధ్యులను చేస్తూ కొందరు విద్యార్థులను కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యార్థులను యాజమాన్యం రాజకీయ కార్యక్రమాల్లో భాగం చేయడంలో లేని తప్పు.. ఇలా నినాదాలు చేస్తే వచ్చిందా అంటూ కాలేజీ తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు.