స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించడంతో పాటు మతం మార్చుకుని, పెళ్లి కూడా చేసుకోవాలని తీవ్ర స్థాయిలో ఇబ్బంది పెట్టినట్లు ఓ అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉండడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సంకేతాలు కనిపిస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీలో మరిన్ని సంచలన విషయాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమ వైపు నుంచి కూడా రెస్పాన్స్ కనిపిస్తోంది. జానీ మాస్టర్ వివాాదంపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టింది. ఇందులో నటి, యాంకర్ ఝాన్సీతో పాటు సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితురాలికి పూర్తి అండగా నిలుస్తామని ఝాన్సీ హామీ ఇచ్చారు. ఇండస్ట్రీలో కూడా పలువురు ప్రముఖులు ఆమెకు సపోర్ట్ చేస్తామన్నట్లు ఆమె తెలిపారు.
ఇలాంటి ఆరోపణలు చేసిన అమ్మాయిలకు ఇండస్ట్రీలో పని దొరకడం కష్టమవుతుందనే అభిప్రాయాలున్నాయని.. కానీ బాధితురాలికి ఆ ఇబ్బంది రాకుండా చూస్తున్నామని ఝాన్సీ తెలిపింది. ఒక స్టార్ డైరెక్టర్ ఆమెకు తన సినిమాలో అవకాశం ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు ఝాన్సీ వెల్లడించింది. అలాగే ఒక స్టార్ హీరో తన మేనేజర్ ద్వారా ఆమెను సంప్రదించారని.. ఆయన కూడా పని విషయంలో తనకు సపోర్ట్ చేస్తామన్నారని ఝాన్సీ తెలిపింది.
బాధితురాలు పోలీసులను ఆశ్రయించడానికి ముందే ఫిలిం ఛాంబర్‌ను సంప్రదించిందని.. మైనర్ అయిన తనకు న్యాయ సహాయం కూడా అవసరమని.. తాము ఇద్దరి తరఫున వాదనలు విన్నామని ఝాన్సీ తెలిపింది. 90 రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తామని ఆమె చెప్పింది. ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొనే అమ్మాయిలు ఎవరైనా తమకు ఫిర్యాదు చేయొచ్చని.. వారి వివరాలు గోప్యంగా ఉంచి సమస్యను పరిష్కరిస్తామని ఝాన్సీ స్పష్టం చేసింది.