గడిచిన కొద్ది రోజులుగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా.. మోడీ సర్కారుకు నిద్ర లేకుండా చేస్తున్న రైతు నేత రాకేశ్ టికాయత్ కు చేదు అనుభవం ఎదురైంది. భారీగా చేరిన మద్దతుదారులను ఉద్దేశించి.. భావోద్వేగంగా ప్రసంగిస్తున్న వేళ.. ఊహించని రీతిలో సభా వేదిక కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. లక్కీగా స్వల్ప గాయాలతో బయటపడినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానాలోని జింద్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం బుధవారం సాయంత్రం జరగ్గా.. ఆలస్యంగా బయటకు వచ్చింది.
ఇప్పటివరకు తాము సాగు చట్టాల రద్దు గురించే మాట్లాడామని.. ఇకపై యువత అధికారం నుంచి వైదొలగాలని మాట్లాడితే మీరేం చేస్తారు?అంటూ సూటి ప్రశ్నను సంధించినట్లుగా చెబుతున్నారు. కేంద్రం ఇప్పటికైనా మూడు రైతు వ్యతిరేక చట్టాల స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలన్న డిమాండ్ ను చేశారు.ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల వాహనాలు రాకుండా ఉంచేందుకు రహదారులపై ముళ్ల కంచెలు..పెద్ద ఎత్తున మేకులు ఏర్పాట్లపై స్పందించిన తికాయత్.. రాజు భయపడినప్పుడే.. కోటను రక్షించుకునే చర్యలు చేపడతారంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటైన విమర్శలు చేశారు. మహా జోరుగా ప్రసంగం చేస్తున్న వేళ.. ఉన్నట్లుండి ఒక్కసారిగా సభా వేదిక కూలిపోవటంతో కలకలం రేగింది. అయితే.. రాకేశ్ తికాయత్ తో పాటు.. మిగిలిన వారు.. సభా వేదిక కూలిన ఉదంతంలో స్వల్ప గాయాలు కావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారీగా సభను ఏర్పాటు చేసేటప్పుడు.. అందుకు తగ్గట్లు వేదికను సిద్ధం చేయాలన్న ఆలోచన లేకపోవటం ఏమిటి?