ప్రముఖ కథా రచయిత, దర్శకుడు వి.విజయేంద్ర ప్రసాద్ ను బీజేపీ రాజ్యసభకు పంపిన సంగతి తెలిసిందే. అయితే, ఆర్ఎస్ఎస్ పై తాను గతంలో విపరీతమైన ద్వేషం చూపించేవాడనని, కానీ, నాలుగేళ్ల క్రితం నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్ళిన తర్వాత తాను తప్పుడు అభిప్రాయంతో ఉన్నానని తెలుసుకున్నానని విజయేంద్ర పసాద్ ఎంపీ అయిన తర్వాత వెల్లడించాడు. ఒకవేళ ఆర్ఎస్ఎస్ లేకుంటే కాశ్మీర్ మనకు దక్కేదే కాదని, సుందర కశ్మీరం పాకిస్తాన్ వశమైపోయేదని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
అంతేకాదు, త్వరలో ఆర్ఎస్ఎస్ పై తాను ఒక సినిమా తీయబోతున్నానని, ఒక వెబ్ సిరీస్ చేసే ప్రయత్నంలో ఉన్నానని సంచలన ప్రకటన చేశారు. తాను రాసిన కథను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు చూపించానని, ఆ కథ చదివి ఆయన ఎంతో ఆనందించారని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆనాడు తాను రాసిన కథతోనే ఇప్పుడు సినిమా తెరకెక్కించబోతున్నానని ప్రకటించారు. అంతేకాదు, ఆ కంటెంట్ తో వెబ్ సిరీస్ కూడా రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ ల పాత్రలను పరోక్షంగా దర్శకుడు రాజమౌళి ఉపయోగించుకున్నారని, జక్కన్న కూడా బీజేపీకి వత్తాసు పలుకుతున్నాడని విమర్శలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ది న్యూయార్కర్ అనే వీక్లీ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఆ వ్యవహారంపై క్లారిటీనిచ్చారు. తాను బిజెపి ఎజెండాకు అనుగుణంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో పాత్రలను వక్రీకరించలేదని రాజమౌళి అన్నారు. ఆర్ఆర్ఆర్ చారిత్రక పాఠం కాదని, కల్పిత పాత్రలతో రూపొందించిన చిత్రమని చెప్పారు. గతంలో కూడా చాలాసార్లు ఇలాగే చేశామని, ఆర్ఆర్ఆర్ చరిత్రను వక్రీకరిస్తే….మాయాబజార్ కూడా అదే కోవలోకి వస్తుందని అన్నారు.
ఆర్ఆర్ఆర్ విడుదల చేసినప్పుడు తారక్ ముస్లిం గెటప్‌లో టోపీ పెట్టుకోవడాన్ని బిజెపి నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు అని గుర్తు చేశారు. ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రదర్శిస్తే థియేటర్లు తగలబెడతామంటూ బిజెపి నేత ఒకరు తనకు వార్నింగ్ ఇచ్చాడని కూడా జక్కన్న చెప్పారు. దాన్ని బట్టి తాను ఏ పార్టీకైనా వత్తాసు పలుకుతున్నానో లేదో ప్రజలే నిర్ణయించుకోవాలని జక్కన్న అన్నారు. బిజెపి అయినా, ముస్లిం లీగ్ అయినా…ఎవరైనా సరే అతివాదానికి తన పూర్తి వ్యతిరేకమని జక్కన్న క్లారిటీ ఇచ్చారు.