మలయాళ చిత్రం ‘ప్రేమలు’ను తెలుగులో అనువాదం చేసి రిలీజ్ చేసి ఈ మధ్య బాగా వార్తల్లో నిలిచాడు రాజమౌళి తనయుడు ఎస్.ఎస్.కార్తికేయ ఆ చిన్న సినిమా పెద్ద విజయాన్నందుకుని అతడికి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ ఉత్సాహంలో అతను ఒకేసారి రెండు కొత్త సినిమాలను అనౌన్స్ చేయడం విశేషం. అవేమీ అనువాద చిత్రాలు కాదు.. కార్తికేయ ప్రొడ్యూస్ చేయబోయే స్ట్రెయిట్ చిత్రాలు.
అవి అన్ని దక్షిణాది భాషల్లో తెరకెక్కనుండటం ఓ విశేషం అయితే.. మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ ఆ రెండు సినిమాల్లోనూ లీడ్ రోల్ చేయబోతున్నాడు. బాహుబలి ప్రొడ్యూసర్లు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కూడా వీటి నిర్మాణంలో భాగస్వాములు కాబోతుండటం మరో విశేషం. మంగళవారం మధ్యాహ్నం ఈ రెండు చిత్రాలను ఒకేసారి అనౌన్స్ చేశాడు కార్తికేయ.
రెండింట్లో అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నది ‘ఆక్సిజన్’తో పేరుతో తెరకెక్కనున్న చిత్రమే. సిద్దార్థ నాదెళ్ల అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఫాహద్ ముఖానికి మాస్కు.. అలాగే ముఖం మొత్తం ఇండియా మ్యాప్‌లో ఇమిడిపోయినట్లుగా చేసిన డిజైన్ చాలా క్యూరియస్‌గా అనిపిస్తోంది. పోస్టర్ ద్వారా ఏదో చెప్పాలని ట్రై చేశారు కానీ.. సినిమా కాన్సెప్ట్ ఏంటో తెలిశాకే అది అర్థమయ్యేలా కనిపిస్తోంది. డిజైన్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.
ఫాహద్ హీరోగా నటించనున్న మరో చిత్రం ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’. ఇందులో ఫాహద్తో పాటు ఓ చిన్న పాప కూడా ముఖ్య పాత్ర పోషించనుంది. ఫస్ట్ లుక్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తోంది. ఇదేదో ఫాంటసీ టచ్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. బాలయ్య పాపులర్ డైలాగ్ నుంచి టైటిల్ తీసుకోవడం ఆసక్తి రేకెత్తించేదే. ఈ చిత్రాన్ని శశాంక్ యేలేటి డైరెక్ట్ చేయనున్నాడు. జూన్‌లో షూట్ మొదలు కానుంది.