అవకాశాలు అందరికి రావు. కొందరికే వస్తాయి. అలాంటి అవకాశాల్ని వచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకొని మరింత ఎదగాలని అందరూ భావిస్తారు. అదేమీ తప్పు కాదు. ఎదిగేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న తపన పలువురిలో ఉంటుంది. చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే హీరోయిన్ గా ఒక వెలుగు వెలగటం ఒక ఎత్తు అయితే.. భారీ అవకాశాన్ని సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. అలాంటిది తాజాగా సంక్రాంతి సందర్భంగా విడుదలైన రెండు అగ్ర సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్న అరుదైన నటి శ్రుతి హాసన్.
ఆమె గురించి.. ఆమె అందం.. టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటించి రెండు సంక్రాంతి చిత్రాల్లో ఒకటి వీరసింహారెడ్డి జనవరి 12న విడుదలైతే.. రోజు తర్వాత జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలోనే శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించారు. ఇలా వరుస సినిమాలకు హీరోయిన్ గా ఉండటం.. అదీ పండుగ పూట కావటం మరింత ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే.. వీరసింహారెడ్డిలో శ్రుతిహాసన్ పాత్రను చూసినోళ్లంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మరీ.. ఇంత తక్కువ నిడివిలో ఉన్న పాత్రను శ్రుతిహాసన్ ఎలా ఒప్పుకున్నారన్న మాట వినిపిస్తోంది. నిడివి మాత్రమేకాదు.. ఈ సినిమాలోఆమె పాత్ర నోటి నుంచి వచ్చే డైలాగులు కూడా చాలా తక్కువగా.. ఎక్కడో ఒకట్రెండు చోటలే కనిపిస్తాయి. దీంతో.. ఆమె ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. వీరిసింహరెడ్డిలో తన పాత్రకు వచ్చిన బజ్ అంతంత మాత్రంగానే ఉందన్న భావనలో ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో విడుదలైన వాల్తేరు వీరయ్యలో శ్రుతిహాసన్ పాత్ర పరిధి పెద్దది కావటమే కాదు.. ఆమె టాలెంట్ ఎంతన్న విషయం అందరికి తెలిసేలా చేసిన యాక్షన్ సీక్వెల్ తో పాటు.. ఆమెను గ్లామరస్ గా చూపించే విషయంలో ఈ చిత్ర దర్శకుడు సక్సెస్ అయ్యారని చెప్పాలి. సాధారణంగా ఏదైనా అగ్రహీరోల సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండే పాత్రలు చాలా తక్కువ. అయినప్పటికీ వీరసింహారెడ్డి చిత్రంతో పోలిస్తే వాల్తేరు వీరయ్యలోనే శ్రుతిహాసన్ పాత్ర నిడివి పెద్దదిగా ఉందని చెప్పాలి. దీంతో.. బాలయ్య సినిమా విషయంలో డిస్పాయింట్ గా ఉండగా.. దాన్ని అధిగమించేలా వాల్తేరు వీరయ్య ఆమెకు ఉపశమనాన్ని ఇచ్చిందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి రేర్ ఫీట్ సాధించిన హీరోయిన్ గా శ్రుతి నిలిచిందని మాత్రం చెప్పక తప్పదు.