డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాజెక్టు పై తెలంగాణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఉన్నాయి. అసలు ఇంతకాలం ఇళ్లను ఇవ్వకపోవడానికి ఏదయితే కారణమో అదే మాటను బహిరంగంగా అనేశాడా మంత్రి. ఇంతకీ అన్నది ఎవరు? ఏమన్నారో చూద్దాం.
టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన పథకం డబుల్ బెడ్రూమ్ ఇల్లు. దీనిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లబ్ధిదారుల కంటే కడుతున్న ఇళ్లు తక్కువ అని, కట్టిన ఇళ్లను కూడా లాటరీ ద్వారా కేటాయిస్తామని చెప్పారు. అందుకే దేవుడి దయ ఉంటేనే ఇల్లు వస్తుందని అన్నారు.
ఇది ఎలాగూ జరిగేదే. కానీ ఇలాంటి మాటలు మంత్రే చెప్పడం ద్వారా… చాలామందికి ఇల్లు ఇవ్వడం లేదు అని నెగెటివ్ పాయింట్ హైలెట్ అయ్యింది. నిజానికి గత ఎన్నికల ముందే ఈ ఇల్లు కట్టి పంచొచ్చు. కానీ అలా చేస్తే ఇల్లు రాని వారు టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓటు వేస్తారు అన్న ఉద్దేశంతో కేసీఆర్ తెలివిగా వాయిదా వేసుకుంటు వచ్చారు. కానీ ఇంతకాలం కేసీఆర్ దాచిపెట్టిన రహస్యాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విప్పేశారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే..
దేశంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా లక్షలాది ఇళ్లను కట్టి ఇవ్వలేదు. ప్రతి ఏటా కొన్ని ఇళ్లను నిర్మించి ఇస్తాం. దేవుడి దయ ఉంటే ఎప్పుడో ఒకసారి ఇల్లు వస్తుంది. దేవుడిని ప్రార్థిస్తూ ఉండాలి. అదృష్టం ఉంటే ఒక ఏడాదిలోనే ఇల్లు రావచ్చు. పదేళ్లకో, 15 ఏళ్లకో అందరికీ ఇళ్లు వస్తాయి… అన్నారు శ్రీనివాస్ గౌడ్.