ఐపీఎల్లో మాంచి ఫాలోయింగ్ ఉన్న జట్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఒకప్పుడు ఆ జట్టును లోకల్ ఫ్యాన్స్ అంతగా ఓన్ చేసుకునేవారు కాదు కానీ.. వార్నర్ కెప్టెన్ అయ్యాక కథ మారింది. ఇక గత ఏడాది ప్యాట్ కమిన్స్ సారథి అయ్యాక జట్టు లెవెలే మారిపోయింది. ఐపీఎల్లో ఇంతకుముందెన్నడూ లేని విధ్వంసక బ్యాటింగ్‌తో ఆ జట్టు ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది. లోకల్ ఫ్యాన్ సపోర్ట్ తిరుగులేని స్థాయికి చేరుకుంది. సన్‌రైజర్స్ గురించి చాలా గర్వంగా చెప్పుకుంటారు ఫ్యాన్స్. ఇలాంటి ఫాలోయింగ్ ఉన్న జట్టు హైదరాబాద్‌ను వదిలి వెళ్లిపోతాం అంటే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) పెడుతున్న ఇబ్బందితో సన్‌రైజర్స్ ప్రతినిధులు ఇప్పుడు ఇదే మాట అంటుండడం గమనార్హం.
గత రెండేళ్లుగా హెచ్‌సీఏ పెద్దలు తమను తీవ్రంగా వేధిస్తున్నారంటూ సన్‌రైజర్స్ ప్రతినిధి తాజాగా సంఘం కోశాధికారికి రాసిన లేఖ సంచలనం రేపుతోంది. అగ్రిమెంట్ ప్రకారం స్టేడియం మొత్తం కెపాసిటీలో పది శాతం టికెట్లను కాంప్లిమెంటరీ పాస్‌ల కింద ప్రతి ఫ్రాంఛైజీ రాష్ట్ర సంఘానికి అందిస్తుంది. సన్‌రైజర్స్ కూడా హెచ్‌సీఏకు అలాగే పాస్‌లు ఇస్తోంది. కానీ అంతకుమించి తమకు అదనంగా పాస్‌లు ఇవ్వాలని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు.. సన్‌రైజర్స్‌ను వేధిస్తున్నారట.
గత మ్యాచ్ సందర్భంగా అదనపు పాస్‌లు ఇవ్వనందుకు సన్‌రైజర్స్‌కు కేటాయించిన కార్పొరేట్ బాక్సుకు తాళాలు కూడా వేయించారట. గత రెండేళ్లలో తమను ఇలా చాలాసార్లు బెదిరించారని.. తాము ఇక్కడ ఉండడం ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని.. ఇలా అయితే హైదరాబాద్‌ను వదిలి మరో నగరానికి తరలిపోవడం తప్ప తమకు మరో మార్గం లేదని ఈ లేఖలో సన్‌రైజర్స్ ప్రతినిధి తేల్చి చెప్పారు. ఈ వ్యవహారం ఇప్పుడు క్రీడా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హెచ్‌సీఏ అధ్యక్షుడి తీరును అందరూ తప్పుబడుతున్నారు.