ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌కు పక్కన ఉండే..సింగపూర్ ఆదర్శం కాదని.. అభివృద్ధిలో ముందున్న అమెరికా, జపాన్‌లు కూడా ఆదర్శం కాదని ..ఎక్కడో వెనుకబడిన దేశంగా ఉన్న దక్షిణాఫ్రికానే ఆయనకు ఆదర్శమని నారా లోకేష్ విమర్శించారు. అందుకే.. ఆ దేశాన్ని ఆదర్శంగా తీసుకునే రాష్ట్రంలో మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడుతున్నారని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ గుంటూరు జిల్లాలోని రావెల గ్రామంలో రాజధాని అమరావతి విషయంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ‘అమరావతి ఆక్రందన’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో రాజధానికి భూములు ఇచ్చిన రైతులతో పాటు.. స్థానిక తాడికొండ వైసీపీ సస్పెండైన ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు.. తమ కష్టాలను నారా లోకేష్‌కు చెప్పుకొన్నారు.
“నాలుగేళ్ల వైసీపీ పాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోయి నాలుగేళ్లు అయ్యింది. దుర్గగుడికి వెళ్తే పోలీసులు అడ్డుకుని కొట్టారు. బూటుకాళ్లతో తన్నారు. పొలాల్లో పనిచేసే కూలీలను పలుచోట్లకు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారు. మేం ఏమైనా దొంగలమా? నక్సలైట్లమా? రాజధాని కోసం భూములు ఇవ్వడమే మేం చేసిన తప్పా?’’ అని స్థానిక రైతులు గగ్గోలు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నామన్నారు.
అనేక మంది రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు దక్షిణాఫ్రికా మోడల్ నచ్చినట్టుందని.. రాష్ట్రాన్ని కూడా తిండి గింజలకు కరువయ్యేలా.. ఆ దేశం మాదిరిగా తయారు చేయాలని భావిస్తున్నా డని వ్యాఖ్యానించారు. ధైర్యంగా ఉండాలని రైతులకు సూచించారు. వచ్చేది చంద్రబాబు ప్రభుత్వమేనని తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణను చేసి చూపించిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు.
ఎన్నికల ముందు నిండు అసెంబ్లీ వేదికగా జగన్ రాజధాని అమరావతికి జై కొట్టిన విషయాన్ని ఈ సందర్భంగా నారా లోకేష్ ప్రస్తావించారు. ఎన్నికల తర్వాత మాట తప్పి.. మడమ తిప్పారని అన్నారు. అమరావతి రైతులను అన్ని రకాలుగా అవమానించారని చెప్పారు. హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని డంబాలు చెప్పడమే కానీ.. దీనిపై న్యాయవ్యవస్థనుఇప్పటికీ కోరలేదని.. అన్ని వర్గాల, ప్రాంతాల ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.