కనిపించని దేవుడు సంగతి పక్కన పెడితే.. కనిపించే దైవంగా మారారు సినీ నటులు సోనూసూద్. కరోనా నేపథ్యంలో వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పించటం ద్వారా తొలిసారి వార్తల్లోకి వచ్చిన ఆయన.. అప్పటినుంచి తన వరకు వచ్చిన ప్రతి సమస్యను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే వందలాదిమందికి సాయం చేసిన సోనుసూద్.. తాజాగా ఒకే సమయంలో రెండుచోట్ల సాయం చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. తలుచుకున్నంతనే సాయం చేయటం.. కోరుకున్నంతనే వరాన్నిఇస్తున్నారంటూ సోనూసూద్ తీరును పొగిడేస్తున్నారు.
తాజాగా సూద్ చేసిన సాయాలు చూస్తే.. ఏపీలోని క్రిష్ణా జిల్లాకు చెందిన పదిహేను నెలల చిన్నారికి సోనుసూద్ పునర్జన్మను ఇచ్చారు. తిరువూరు మండలం మునుకుళ్ల గ్రామానికి చెందిన పదిహేనునెలల హర్షితకు పుట్టినప్పటి నుంచి గుండె సమస్యతో బాధ పడుతోంది. పేదరికంలో ఉన్న వారు చికిత్స చేయించలేని దుస్థితిలో ఉన్నారు.
దీంతో.. చికిత్స చేసేందుకు భారీగా ఖర్చు చేయాల్సి రావటం.. అంత స్థితి వారికి లేకపోవటంతో ఈ విషయాన్నిసోను సూద్ కు సోషల్ మీడియా ద్వారా సమాచారం అందించారు.
దీనిపై స్పందించిన ఆయన.. ముంబయిలోని ఒక ప్రముఖ ఆసుపత్రితో మాట్లాడి చిన్నారి సర్జరీకి అయ్యే రూ.4.50 లక్షల ఖర్చును సమకూర్చారు. తాజాగా సర్జరీ పూర్తి అయిన చిన్నారి తల్లిదండ్రులతో సహా స్వగ్రామానికి వచ్చింది. సోనుసూద్ చేసిన సాయాన్నితామెప్పటికి మర్చిపోలేమని చిన్నారి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురవుతున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో సోనుసూద్ ఒక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా షూటింగ్ లో వంద మంది సినీ కార్మికులకు స్మార్ట్ ఫోన్లు అందించారు. దీంతో.. వారు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఇలా కోరుకున్న వారి కోరికల్ని తీరుస్తున్న సోను తీరు మరోసారి చర్చగా మారింది.