తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తామిచ్చిన 6 హామీలపై సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా 6 హామీల్లో రెండింటిని అమలు చేసేందుకు కాంగ్రెస్ సర్కారు శ్రీకారం చుట్టింది. అందులో మొదటిగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం గ్యారెంటీని ఈరోజు అమలు చేయనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
తెలంగాణలో ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సులలో బాలికలు, మహిళలకు టికెట్ లేకుండా ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. అయితే తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమే ఈ ఉచిత ప్రయాణం వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది.
మరోవైపు, సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు ఒక పండుగ అని రేవంత్ అన్నారు. డిసెంబర్ 9, 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని, ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారని చెప్పారు.
తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో చూడలేదని, తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని అన్నారు. తెలంగాణ ప్రజలు కృతజ్ఞత భావంతో ఉంటారని మొన్నటి ఎన్నికల తీర్పుతో నిరూపించారని రేవంత్ అన్నారు. ఇక, అన్ని వర్గాల వారికి 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయాలని డిస్కంలను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా అందించేందుకు ఎంత వ్యయం అవుతుందో అంచనాలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.