జగన్ పాలనలో ఏపీలో నాసిరకం మద్యం బ్రాండ్లు జనాల ఇల్లు, ఒళ్లు గుల్ల చేస్తున్నాయని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతల సొంత కంపెనీలలో తయారయ్యే చీప్ లిక్కర్ ను అధిక రేట్లకు అమ్ముతున్నారని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విపక్ష నేతలు విమర్శిస్తున్నాయి. అయినా సరే, ఏపీలో మద్యపాన నిషేధం అంటూ ప్రభుత్వం మాత్రం నాసిరకం మద్యాన్ని అమ్మడం ఆపడం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని మందుబాబులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాంచి కిక్కిచ్చే బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో బీజేపీని గెలిపిస్తే నాణ్యమైన లిక్కర్ క్వార్టర్ బాటిల్ ను రూ.70కే అందిస్తామని ప్రకటించారు సోము. ఒకవేళ కుదిరితే రూ.50కే క్టార్టర్ బాటిల్ ఇస్తామంటూ చెప్పడంతో మందుబాబులు చిందేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో క్వార్టర్ బాటిల్ ధర రూ.200గా, తెలంగాణలో దాదాపు రూ.100గా ఉంది.
ఏపీలో ప్రభుత్వం నాసిరకం లిక్కర్ ను ఎక్కువ రేట్లకు అమ్ముతోందని, ప్రముఖ బ్రాండ్ల మద్యం మాత్రం దొరకడం లేదని సోము ఆరోపించారు. రాష్ట్రంలో కోటి మంది మందుబాబులున్నారన్న సోము…వారంతా 2024లో బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఒక వ్యక్తి లిక్కర్ కోసం నెలకు రూ.12,000 ఖర్చు చేస్తున్నారని, ఆ ఆదాయాన్ని ప్రభుత్వం తిరిగి ఏదో ఒక పథకం రూపంలో ఇస్తోందని ఆరోపించారు.
ఈ క్రమంలోనే సోము కామెంట్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఏపీని డెవలప్ చేస్తామని చెప్పి అధికారంలోకి రావాల్సిన బీజేపీ…ఇలా చీప్ గా చీప్ లిక్కర్ రేట్ తగ్గిస్తామంటూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఓట్లు..గెలుపోటముల సంగతి దేవుడెరుగుగానీ…ఏపీలో ఎక్కువ రేట్లు పెట్టి చీప్ లిక్కర్ తాగుతున్న మందుబాబులకు మాత్రం సోము వీర్రాజు కామెంట్లు కిక్ ఇచ్చాయని సెటైర్లు వేస్తున్నారు.