నలభై ఏండ్ల రాజకీయ జీవితం.. కానీ గెలుపు రుచి చూసి 20 ఏళ్లయ్యింది. దాదాపు ఐదుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమినే చవిచూశారు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు ఆరోసారి ఘనవిజయం సాధించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్దన్ రెడ్డి మీద 14 వేలకు పైగా మెజారిటీతో గెలుపొందారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లికి చెందిన సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి నాలుగు దశాబ్దాల నుంచి యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉన్నారు.
1994 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్లో ఐదు శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. 1999లో కూడా రెండోసారి గెలిచి మళ్లీ మంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత వైఎస్సార్ ప్రభంజనంలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్దన్ రెడ్డి చేతిలోనూ ఆయనకు పరాజయం తప్పలేదు.
2019లో టీడీపీ ఘోర పరాభవం దృష్ట్యా ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని అనుకుంది. ఈ క్రమంలో మూడుసార్లు ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వబోమని నారా లోకేశ్ ఫ్రకటించారు. దీంతో సోమిరెడ్డి టికెట్‌పై అయోమయం నెలకొంది. తొలి రెండు జాబితాల్లో ఆయన పేరును ప్రకటించలేదు. అయితే చంద్రబాబుతో ఉన్న అనుబంధంతో సోమిరెడ్డి కోడలు శృతికి కూడా టికెట్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ సోమిరెడ్డి చక్రం తిప్పారు. వైసీపీ అభ్యర్థి కాకానిని ఎదుర్కోవాలంటే ఆమె అనుభవం సరిపోదని.. తానైతేనే కరెక్ట్ అని అధిష్ఠానాన్ని నమ్మించాడు. ఎట్టకేలకు టికెట్ సంపాదించాడు.
కష్టపడి ఎలాగోలా టికెట్ సంపాదించిన సోమిరెడ్డి.. గెలవడం అనివార్యమైంది. ఈ క్రమంలోనే సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇవే తనకు ఆఖరు ఎన్నికలని.. మద్దతిచ్చి గట్టెక్కించమంటూ వేడుకున్నారు. చివరకు ఆ సెంటిమెంట్ అస్త్రం వర్కవుట్ అయ్యింది. తాజా ఎన్నికల ఫలితాల్లో కాకానిపై 15,994 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.