అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న కుకట్ పల్లిలో థియేటర్ అన్నంతనే గుర్తుకు వచ్చేది శివపార్వతి. కేపీహెచ్ బీ రోడ్డు మీద భారీ భవనం ఏదైనా ఉందంటే అది శివపార్వతి థియేటర్ మాత్రమే. ఠీవీగా కనిపించే ఆ థియేటర్ షో అయ్యాక థియేటర్ నుంచి వచ్చే ప్రేక్షకులతో ఆ రోడ్డు కళ కళలాడేది. అలాంటి థియేటర్ ఈ రోజుకు రోడ్డు పక్కనే ఉన్నప్పటికీ.. ఆ థియేటర్ కనిపించకుండా ఉండేలా పెద్ద పెద్ద భవనాలు వచ్చేశాయి.
ఇప్పుడు అదే శివపార్వతి థియేటర్ లో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత.. సరిగ్గా చెప్పాలంటే ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున.. భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో థియేటర్ పూర్తిగా కాలిపోయింది.
ఈ అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యుట్ గా అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో థియేటర్ లో మంటలు చెలరేగటం.. చూస్తుండగానే మంటలు భారీగా వ్యాపించాయి. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించటంతో వారు వచ్చి మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. మూడు ఫైరింజన్లతో మంటల్ని ఆపారు.
మంటల ధాటికి థియేటర్ స్క్రీన్.. కుర్చీలు.. మొత్తంగా కాలిపోయాయి. థియేటర్ పై కప్పు కూలింది. దాదాపు రూ.2 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ థియేటర్ లో నాని నటించిన శ్యామ్ సింగ్ రాయ్ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. థియేటర్ మూసి ఉన్న వేళ.. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటంతో భారీ ప్రమాదం తప్పినట్లుగా చెప్పాలి. షో నడిచే వేళలో.. ఇలాంటిది జరిగి ఉంటే.. ఊహించని రీతిలో ప్రమాద తీవ్రత ఉంటుందని చెప్పాలి.