ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ఇక లేరు. కొద్ది రోజుల క్రితం నిమోనియాతో హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరిన సిరివెన్నెల నేడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. కొద్ది రోజులగా వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న సిరివెన్నెల ఆరోగ్యపరిస్థితి విషమించడంతో ఈ రోజు మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు. సిరివెన్నెల మరణవార్తతో ఆయన కుటుంబంతో పాటు యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.
సిరివెన్నెల హఠాన్మరణంపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. సీతారామశాస్త్రికి భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు యోగి, రాజా ఉన్నారు. 1955 మే 20న అనకాపల్లిలో సిరివెన్నెల జన్మించారు. కాకినాడలో ఎంఏ చదువుతున్న సమయంలో సీతారామశాస్త్రిలో టాలెంట్ ను గుర్తించి కళాతపస్వి కె.విశ్వనాథ్ టాలీవుడ్ కు పరిచయం చేశారు.
ఆ తర్వాత ‘సిరివెన్నెల’ పాటలకు గాను తొలి నంది అవార్డును ఆయన అందుకున్నారు. ఆపై సిరివెన్నెల వెనుదిరిగి చూడలేదు. వరుసగా మూడేళ్ళు ఉత్తమ గేయరచయితగా నంది అవార్డులు అందుకుని హ్యాట్రిక్ కొట్టారు. కెరీర్ లో మొత్తం 11 సార్లు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డులు అందుకున్న ఘనత సిరివెన్నెల సొంతం. 2019లో ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్న సిరివెన్నెల మరెన్నో సత్కారాలు అందుకున్నారు.‘ఆర్.ఆర్.ఆర్.’లో “దోస్తీ…” పాట సిరివెన్నెల రాసిన వాటిలో తాజాది.