కొన్నేళ్ల నుంచి ఆశించిన సక్సెస్ రేట్ లేక బాలీవుడ్ చాలా ఇబ్బంది పడుతోంది. ఎన్నో అంచనాలతో వస్తున్న కొన్ని సినిమాలు దారుణమైన ఫలితాన్ని అందుకుంటున్నాయి. ఈ ఏడాది ‘బడేమియా చోటేమియా’ సినిమా అలాగే డిజాస్టర్ అయి నిర్మాతలను నిండా ముంచేసింది. ఇప్పుడు రోహిత్ శెట్టి-అజయ్ దేవగణ్‌ల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ‘సింగమ్ అగైన్’ మూవీ బాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 1న రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రైలర్ లాంచ్ చేశారు. ఏకంగా 5 నిమిషాల సుదీర్ఘ నిడివితో సాగిన ఈ ట్రైలర్లో చాలా హైలైట్లు ఉన్నాయి. రోహిత్ శెట్టి సినిమాల్లో పోలీస్ వేషాలు వేసిన అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్.. ఇలా చాలామందితో ఈ సినిమాలో క్యామియోలు చేయించారు. వాళ్లందరి పాత్రలనూ పరిచయం చేస్తూ యాక్షన్ బొనాంజాగా ట్రైలర్‌ను తీర్చిదిద్దారు.
సింగమ్ అగైన్ మూవీని ‘రామాయణం’ కాన్సెప్ట్‌లో తీయడం విశేషం. హీరో (అజయ్ దేవగణ్) రాముడైతే.. హీరోయిన్ (కరీనా కపూర్) సీత అన్నట్లు. ఆమెను ఎత్తుకుపోయే విలన్ (అర్జున్ కపూర్) రావణుడన్నమాట. హీరోయిన్ని తీసుకు రావడానికి హీరో చేసే పోరాటంలో అతడికి సాయం చేసే రకరకాల పాత్రల్లో దీపికా, రణ్వీర్, అక్షయ్, టైగర్ తదితరులు కనిపించారు.
ఈ మధ్య చారిత్రక, సాంస్కృతిక నేపథ్యంలో వచ్చే సినిమాలు బాగా ఆడుతున్న నేపథ్యంలో రామాయణానికి ముడిపెడుతూ ఇందులో కథను, పాత్రలను డిజైన్ చేసినట్లున్నాడు రోహిత్ శెట్టి. కానీ అదంతా కొంచెం కృత్రిమంగా, అతిగా అనిపించింది. రోహిత్ సినిమాలంటేనే ఓవర్ ద టాప్ ఉంటాయి. కానీ ఇది మరీ ఎక్కువ అతిగా అనిపిస్తోంది.
ఈ ట్రైలర్ లాంచ్ అయ్యాక ‘క్రింజ్’ అనే వర్డ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండడాన్ని బట్టి జనాల రియాక్షన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇది మరో ‘బడేమియా చోటేమియా’ అవుతుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.