తెలుగు సినిమాకు సంబంధించిన అవార్డుల ఫంక్షన్ అంటే నంది అవార్డుల పురస్కారం అన్నది చప్పున గుర్తుకు వచ్చేది. అయితే.. అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు నంది అవార్డులు ఇవ్వటం మానేశాయి. కారణం ఏమిటన్నది ఎవరూ చెప్పింది లేదు.
ఇలాంటివేళ.. అయితే జాతీయ పురస్కారాలు.. లేదంటే కొన్ని ప్రైవేటు సంస్థలు అందించే పురస్కారాలు. వీటిల్లో కీలకమైనది ‘సైమా’. గడిచిన కొన్నేళ్లుగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు పొట్టిగా చెప్పాలంటే.. ‘సైమా’ పేరుతో దక్షిణాది చిత్ర రంగానికి సంబంధించి దేనికదే అన్నట్లుగా అవార్డులు ఇస్తున్నారు.
2019.. 2020లలో చోటు చేసుకున్న కరోనా ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈ అవార్డుల ప్రకటన కార్యక్రమం వాయిదా పడింది. దీంతో.. ఆ లోటును తీర్చేందుకు ఈ ఏడాది.. గతంలో మిస్ అయిన రెండేళ్ల పురస్కారాల సందడిని డబుల్ ఉత్సాహంలో నిర్వహించేందుకు సైమా సిద్ధమైంది.
హైదరాబాద్ లో జరుగుతోన్న ఈ అవార్డుల పురస్కార వేడుకలో టాలీవుడ్ కు సంబంధించి 2019కి విజేతల వివరాలు వెల్లడయ్యాయి. ఉత్తమ చిత్రంగా జెర్సీ ఎంపికైతే.. ఉత్తమ నటుడిగా మహర్షిలో మహేశ్ బాబు నటనకు ఉత్తమ నటుడు పురస్కారం సొంతమైంది. ఇక.. ఉత్తమ నటిగా ఓ బేబీ మూవీతో విలక్షణ పాత్ర చేసిన సమంతకు అవార్డు దక్కింది. ఉత్తమ దర్శకుడిగా మహర్షి చిత్రానికి వంశీ పైడిపల్లికి దక్కింది.
మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రానికి అత్యధికంగా ఐదు పురస్కారాలు లభిస్తే.. నాని కథానాయకుడిగా నటించిన జెర్సీకి మూడు పురస్కారాలు లభించాయి. ఇక.. సమంత కథాయికగా నటించిన ‘ఓ బేబీ’ చిత్రానికి రెండు పురస్కారాలు లభించాయి. మొత్తంగా అవార్డుల్ని సొంతం చేసుకోవటం మహర్షి మూవీ ముందంజలో ఉందని చెప్పాలి. మిగిలిన సినిమాల్లో వేటికి.. ఏయే విభాగాలకు విజేతలుగా నిలిచారన్నది చూస్తే..
చెప్పుకోవాల్సిన సర్ ప్రైజ్ ఏంటంటే… గేమ్ మొత్తం… మహర్షిదే !
సైమా 2019 టాలీవుడ్ విజేతలు వీరే..
ఉత్తమ చిత్రం: జెర్సీ
ఉత్తమ వినోదాత్మక చిత్రం: ఎఫ్2
ఉత్తమ దర్శకుడు: వంశీ పైడిపల్లి (మహర్షి)
ఉత్తమ నటుడు: మహేష్ బాబు (మహర్షి)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నాని (జెర్సీ)
ఉత్తమ నటి: సమంత (ఓ బేబీ)
ఉత్తమ నటి (క్రిటిక్స్): రష్మికా మందన్న (డియర్ కామ్రేడ్)
ఉత్తమ సహాయ నటుడు: అల్లరి నరేష్ (మహర్షి)
ఉత్తమ సహాయ నటి: లక్ష్మీ (ఓ బేబీ)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి)
ఉత్తమ గేయ రచయిత: శ్రీమణి(ఇదే కదా.. మహర్షి)
ఉత్తమ గాయకుడు: అనురాగ్ కులకర్ణి(ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)
ఉత్తమ గాయని: చిన్మయి (మజిలీ-ప్రియతమా)
ఉత్తమ విలన్: కార్తికేయ గుమ్మకొండ (నానిస్ గ్యాంగ్ లీడర్)
ఉత్తమ తొలి పరిచయ హీరో: శ్రీ సింహా (మత్తు వదలరా)
ఉత్తమ తొలి పరిచయ హీరోయిన్: శివాత్మిక రాజశేఖర్ (దొరసాని)
ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు: స్వరూప్ ఆర్ఎస్జె (ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ)
ఉత్త తొలి పరిచయ నిర్మాత: స్టూడియో 99 (మల్లేశం)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సానూ వర్గీస్ (జెర్సీ)
ఉత్తమ కమెడియన్: అజయ్ ఘోష్ (రాజుగారి గది 3)