పార్టీ మారినోళ్లంతా ఏదో ఆశించే మారుతారు. అప్పటి వరకు ఉన్న పార్టీని వదిలి పెట్టారంటే.. ఎన్నో ఊహించుకుని.. ఇక్కడ కన్నా అక్కడ బాగుంటుందని అనుకుంటారు. అందుకే.. నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత వస్తుందని తెలిసినా.. పార్టీలు మారుతుంటారు. కానీ, ఎవరి విషయం ఎలా ఉన్నా.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలకమైన దర్శి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు విషయంలో మాత్రం అనుకున్న విధంగా రాజకీయాలు సాగలేదని ఆయన అనుచరులే చెబుతున్నారు.
“మా నాయకులు అనుకున్నది ఒకటి .. జరిగింది మరొకటి“ అని శిద్దాతో దాదాపు 20 ఏళ్లుగా నడుస్తున్న సుబ్బారావు అనే అనుచరుడు తాజాగా వ్యాఖ్యానించారు. 2014లో టీడీపీ నుంచి విజయం దక్కించుకున్న శిద్దా రాఘవరావు.. వైశ్య సామాజిక కోటాలో మంత్రి పదవిని దక్కించుకున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకుని.. ఆయన అల్లుడి కంపెనీలకు కాంట్రాక్టులు కూడా ఇప్పించుకున్నారు. రెండో దఫాలో ఆయనపై విమర్శలు.. వచ్చినా.. చంద్రబాబు ఆయనను మంత్రి వర్గంలోనే కొనసాగించారు.
అయితే.. 2019 ఎన్నికల సమయానికి చంద్రబాబు తనుకు అన్యాయం చేశారని.. తన సీటును వేరే వారికి ఇచ్చి… తాను ఓడిపోతానని చెప్పినా ఒంగోలుకు పంపించారన్న ఆగ్రహంతో శిద్దా.. ఎన్నికల తర్వాత.. కనీసం మాట మాత్రంగా కూడా చెప్పకుండానే వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్సీ ఆశించారు. అది దక్కలేదు. అయితే.. కొన్ని కాంట్రాక్టులు దక్కాయి. కానీ, నిధులు మాత్రం ఇప్పటికీ పెండింగులోనే ఉన్నాయి. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారని అనుకున్నా.. అది కూడాదక్కలేదు.
ఇక, మళ్లీ మాతృసంస్థకు వచ్చేయాలని అనుకున్నా.. జనసేనతో పొత్తులో ఉన్న టీడీపీ దర్శి స్థానాన్ని జనసేనకు దాదాపు కేటాయించేసిందనే వార్తలు వస్తున్నాయి. దీంతో శిద్దా పరిస్థితి ఎటూ కాకుండా పోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇటు పార్టీలో గుర్తింపు లేక. అటు టికెట్ కూడా రాక.. పెట్టిన పెట్టుబడులూ చేతికి అందక.. రాఘవరావు పరిస్థితి దారుణంగా తయారైందని అంటున్నారు. అదే టీడీపీలో ఉండి ఉంటే… ఈ దఫా టికెట్‌తోపాటు.. ఆయన కుమారుడికి కూడా గుర్తింపు ఉండేదని అంటున్నారు. మొత్తంగా రెంటికీ చెడిపోయి.. రాజకీయంగా ఆయన ఎటూ కాకుండా పోయారనే చర్చ సాగుతోంది.