తెలుగులో ట్రెండ్ సెట్ చేసిన సంచలన చిత్రాల్లో ‘అర్జున్ రెడ్డి’ ఒకటి. దాని ప్రభావం చాన్నాళ్ల పాటు టాలీవుడ్ మీద కొనసాగింది. ఇప్పటికీ ఆ ప్రభావం ఉందనడానికి ‘సిద్దార్థ్ రాయ్’ సినిమానే ఉదాహరణ. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే అడుగడుగునా ‘అర్జున్ రెడ్డి’ ప్రభావం కనిపించింది. అర్జున్ రెడ్డి పాత్ర ఇంకా ఎక్స్ట్రీమ్గా, దానికి ఎక్స్‌టెన్షన్‌లా అనిపించింది ఇందులో హీరో పాత్ర.
ఐతే ‘అర్జున్ రెడ్డి’ని అనుకరించిన సినిమాలేవీ ఆ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేయలేదు. సరైన ఫలితాన్ని అందుకోలేదు. మరి ‘సిద్దార్థ్ రాయ్’ ఏమవుతుందా అని చూస్తున్నారంతా. ఐతే ఇందులోని బోల్డ్ కంటెంట్ యూత్ దృష్టిని కొంత ఆకర్షించిందన్నది వాస్తవం. శుక్రవారం సినిమా రిలీజవుతున్న నేపథ్యంలో ముందు రోజు చిత్ర బృందం పెట్టిన ప్రెస్ మీట్లో దర్శకుడు యశస్వి.. సంగీత దర్శకుడు రదన్ మీద చేసిన విమర్శలు చర్చనీయాంశం అయ్యాయి.
రదన్ అనేక విషయాల్లో తనను ఇబ్బంది పెట్టాడని.. సినిమా ఆలస్యం కావడానికి అతనే ప్రధాన కారణం అని.. తమ మధ్య అనేక వాదోపవాదాలు జరిగాయని.. అవి గొడవల స్థాయికి వెళ్లాయని.. రదన్ టాలెంటెడే అయినప్పటికీ తన యాటిట్యూడ్ పెద్ద సమస్య అని యశస్వి వ్యాఖ్యానించాడు. ఐతే యశస్వి మాటలు విన్నాక.. ఈ విషయంలోనూ ‘అర్జున్ రెడ్డి’తో పోలిక కనిపిస్తుండటం విశేషం. అప్పట్లో రదన్ మీద ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఓ ఇంటర్వ్యూలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
రదన్ టాలెంటెడ్ అంటూనే అతను తనను విపరీతంగా సతాయించాడని పేర్కొన్నాడు. రదన్ను ‘వాడు’ అని సంబోధిస్తూ తీవ్ర విమర్శలు చేశాడు. రదన్ ఒక పట్టాన ట్యూన్స్ ఇవ్వకుండా ఏడిపించాడని చెబుతూ.. తనతో వేగలేక హర్షవర్ధన్ రామేశ్వర్‌తో నేపథ్య సంగీతం చేయించుకున్నట్లు చెప్పాడు. ఇప్పుడు యశస్వి కూడా రదన్ మీద ఇలాంటి విమర్శలే చేయడంతో కంటెంట్‌తో పాటు సంగీత దర్శకుడితో డైరెక్టర్ గొడవ విషయంలోనూ ‘అర్జున్ రెడ్డి’తో పోలికేనా అన్న అభిప్రాయం కలుగుతోంది.