చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ఓ భారీ చిత్రం రాబోతోందని ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. కానీ వారి ఉత్సాహం నీరుగారేలా కనిపిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ‘హరిహర వీరమల్లు’ ఈ నెల 12న విడుదల కావడం అనుమానంగానే కనిపిస్తోంది. విడుదలకు ఇంకో 9 రోజులే మిగిలి ఉండగా.. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాలేదు. ట్రైలర్ రెడీ కాలేదు. ఈ రోజు సెన్సార్ కోసం సినిమాను పంపారని అంటున్నారు కానీ.. అది ఫినిష్డ్ ప్రాడక్ట్ కాదట.
కొంత విజువల్ ఎఫెక్ట్స్ కంటెంట్‌ను ఇంకా జోడించాల్సి ఉంది. అది లేకున్నా పర్వాలేదని సెన్సార్‌కు సినిమాను పంపించేశారు. ఈ రోజు సెన్సార్ అవుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఈ రోజో రేపో సెన్సార్ అయినా.. సినిమాను 12నే రిలీజ్ చేస్తారనే గ్యారెంటీ లేదు. ఇందుకు చాలా అడ్డంకులే కనిపిస్తున్నాయి. రిలీజ్ టైంకి క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా సినిమాను పర్ఫెక్ట్‌గా రెడీ చేయడం సందేహమే అంటున్నారు. 12నే సినిమాను రిలీజ్ చేయాలంటే హడావుడి తప్పదు. ఆ ప్రభావం ఔట్ పుట్ మీద పడొచ్చు.
మరోవైపేమో ఈ సినిమాకు బిజినెస్ పూర్తి కాలేదని తెలుస్తోంది. సినిమా ఆలస్యం వల్ల బడ్జెట్ ఏమో తడిసి మోపెడైంది. మరోవైపు బజ్ తగ్గింది. దీంతో నిర్మాతలు చెబుతున్న భారీ రేట్లకు సినిమాను కొనడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదు. ఇక జూన్ నెల అంతా ప్రతి వారం పెద్ద సినిమాలు రిలీజవుతున్నాయి. థగ్ లైఫ్, కుబేర, కన్నప్ప.. ఇలా ప్రతి వారం ఒక క్రేజీ మూవీ రిలీజవుతోంది. ఈ నేపథ్యంలో బిజినెస్ ఒక కొలిక్కి రాకుండా.. సినిమా పర్ఫెక్ట్‌గా రెడీ కాకుండా.. ఇంత పోటీ మధ్య హడావుడిగా రిలీజ్ చేయడం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇంకొంచెం టైం తీసుకుని సినిమాను పకడ్బందీగా సిద్ధం చేయడం, ప్రమోషన్లు బాగా చేయడం, క్రేజీ కంటెంట్ పెంచి బజ్ పెంచడం.. ఇటు, అటు పోటీ లేకుండా కొన్ని వారాల పాటు రన్ ఉండేలా రిలీజ్ చేయడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జులైలో అయితే పోటీ తక్కువ కాబట్టి.. ప్రస్తుతానికి వాయిదా వేసి ఆ నెలలో మంచి డేట్ చూసి రిలీజ్ చేయడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.