చైనాకు సంబంధించిన సరికొత్త నిజాల్ని.. ఆ దేశం పెంచుకుంటూ పోతున్న అణ్వాయుధాలకు సంబంధించిన ఒక రిపోర్టును అమెరికా నిఘా వ్యవస్త సిద్ధం చేసింది. అందులోని అంశాలు ఉలిక్కిపడేలా చేయటమే కాదు..భారత్ కు అతి పెద్ద శత్రువు ఎవరన్న విషయాన్ని సదరు రిపోర్టు స్పష్టం చేసింది. చైనా తన సైనిక శక్తిని చాలా వేగంగా ఆధునికీకరిస్తోందన్న అంశాన్ని స్పష్టం చేయటమే కాదు తైవాన్ ను అక్రమించే ప్రయత్నాల్లో భాగంగా మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకుంటున్న విషయాన్ని వెల్లడించింది. వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్ మెంట్ పేరుతో అమెరికా నిఘా.. రక్షణ సంస్థలు ఈ రిపోర్టును విడుదల చేశాయి. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం..
చైనా వద్ద ఇప్పటివరకు ఆపరేసనల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇప్పటికే 600 దాటినట్లుగా పేర్కొన్నారు. 2030 నాటికి ఇవి కాస్తా వెయ్యి దాటేస్తాయని అంచనా వేస్తున్నారు. తూర్పు ఆసియాలో బలమైన శక్తిగా ఉండేందుకు చైనా తన వ్యూహాత్మక లక్ష్యాల్ని కొనసాగిస్తోందని.. తైవాన్.. ఫిలిప్పీన్స్ లాంటి వాటిపై బహుముఖ ఒత్తిడిని పెంచాలని చూస్తున్నట్లుగా రిపోర్టు వెల్లడించింది.
ఈ నివేదికలో భారత్ – చైనా అంశాల్ని కూడా ప్రస్తావించారు. చైనాను ప్రధాన శత్రువుగా భారత్ భావిస్తోందని.. అందుకు తగ్గట్లుగా న్యూఢిల్లీ రక్షణ పరమైన నిర్ణయాలు ఉంటున్నట్లుగా పేర్కొన్నారు. బీజింగ్ ను ఎదుర్కోవటం కోసం తన సైనిక బలాన్ని పెంచుకోవటంపై భారత్ ఫోకస్ చేస్తున్నట్లుగా పేరకొన్నారు. చైనా విషయానికి వస్తే దౌత్యం.. వాణిజ్యం.. భద్రతా పరంగా చైనా అంతకంతకూ ముందుకు వెళుతూ.. అమెరికా ప్రపంచ నాయకత్వాన్ని సవాలు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
చైనా తన మిలిటరీ బడ్జెట్ విషయంలోనూ వాస్తవాల్ని దాచిపెడుతున్నట్లుగా నివేదిక పేర్కొంది. 2025లో చైనా తన మిలిటరీ బడ్జెట్ ను 5.2 శాతం పెంచి 247 బిలియన్ డాలర్లు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించిందని.. కానీ రక్షణ రంగం మీద బీజింగ్ చేస్తున్న ఖర్చు అంతకంటే ఎక్కువగానే ఉంటుందని పేర్కొంంది. గత ఏడాది చైనా అనధికారికంగా దాదాపు 304-377 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లుగా అంచనా వేసింది.
చైనా వద్ద అంతకంతకూ పెరుగుతున్న అణ్వాయుధ వార్ హెడ్లను ప్రస్తావించటమే కాదు 2035 నాటికి బీజింగ్ తన సైనిక శక్తిని పెంచుకుంటూనే ఉంటుందని అంచనా వేసింది. ఈ రిపోర్టులో పాక్ అంశాల్ని ప్రస్తావిస్తూ.. ఆ దేశానికి సైనికపరంగా.. ఆర్థికపరంగా చైనా నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని పేర్కొంది. అయినప్పటికి భారత్ ను ఆస్తిత్వ ముప్పుగానే పాకిస్తాన్ భావిస్తోందని.. న్యూఢిల్లీ సైనిక శక్తిని పరిగణలోకి తీసుకొని అణ్వాయుధాల్ని డెవలప్ చేసేందుకు.. సైనిక ఆధునికీకరణ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లుగా పేర్కొంది.