దుబ్బాకలో టీఆర్ఎస్ అనూహ్య ఓటమి
కారు బ్రేకులు తీసేసిన హైదరాబాదీలు
గతంలో 99 కార్పొరేట్ డివిజన్లలో గెలుపు
ఈ దఫా 56 స్థానాలకే పరిమితం
తాను ద్వేషించిన ఆంధ్రులే ఆదుకున్నారు
వారు అధికంగా ఉన్న చోట్ల టీఆర్ఎస్ విజయం
4 స్థానాల నుంచి 48కి పెరిగిన బీజేపీ
ప్రధాన ప్రత్యామ్నాయంగా ‘కమల’ వికాసం
తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా ఆవిర్భవించి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా జేజేలు అందుకుని.. రెండు సార్లు వరుసగా అధికారం పొందిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు మొదటిసారి అనూహ్య పరాజయం ఎదురైంది. 2009 తర్వాత గానీ, 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గానీ జరిగిన ఏ ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ ఓడిపోలేదు. తెలంగాణ సెంటిమెంట్‌ను, ఆంధ్రులపై విద్వేషాన్ని ఆలంబనగా చేసుకుని అప్రతిహత విజయాలు సాధించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ జయకేతనంఎగురవేసింది. అలాంటిది మొదటిసారి దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో ఊహించని ఓటమి ఎదురైంది. ఆ తర్వాత తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో హైదరాబాదీలు టీఆర్ఎస్కు కర్రుకాల్చి వాతపెట్టారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడినవారు బీజేపీ వైపు మొగ్గుచూపితే.. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రులు మాత్రం సుస్థిరత కోసం టీఆర్ఎస్కు ఓట్లేయడం విశేషం. తమపై ఎంత విద్వేషం వెదజల్లినా వారు ఆ పార్టీకి అండగా నిలిచారు. అయినా 150 డివిజన్లకు గాను టీఆర్ఎస్ 56 స్థానాలు మాత్రమే గెలవగలిగింది. ఎంఐఎం మద్దతు లేనిదే టీఆర్ఎస్కు మేయర్ పీఠం దక్కే పరిస్థితి లేదు.
దుబ్బాక.. తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డ. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన మాజీ విలేకరి సోలిపేట రామలింగారెడ్డి 2018 ఎన్నికల్లో 60వేలకు పైగా ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఆయన మరణానంతరం ఆయన భార్యకు టీఆర్ఎస్ టికెట్ లభించింది. తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆమె గెలుపు బాధ్యతను తీసుకుని రెండు నెలలపాటు నియోజకవర్గంలోనే తిరిగి విస్తృతంగా ప్రచారం చేశారు. ఉద్యమ కాలంలో కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగిన రఘునందన్‌రావు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ తరపున నిలబడ్డారు. టీఆర్ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందని, బీజేపీ గట్టి పోటీ ఇస్తోందని నిఘా నివేదికలు రావడంతో కేసీఆర్ తన దృష్టంతా ఇక్కడే కేటాయించారు. అధికార పార్టీ పెద్దఎత్తున అఽధికార దుర్వినియోగానికి పాల్పడింది. ప్రచారంలో చురుగ్గా ఉన్న స్థానిక బీజేపీ నేతలను ఏదోఒక మిషపై అరెస్టు చేయడం.. వారిని వేధింపులకు గురిచేయడం పరిపాటిగా మారింది. రఘునందన్‌రావు తరఫున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్ నేత లక్ష్మణ్ తదితరులు పకడ్బందీగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థికి ఉన్న ఆర్ఎస్ఎస్ నేపథ్యం బాగా ఉపకరించింది. సంఘ్ కేడర్ చాపకింద నీరులా ఊరూరా ప్రచారం చేసింది. టీఆర్ఎస్ ఎదురీదుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. రఘునందన్‌రావు ప్రచారానికి వెళ్లకుండా అనేక అడ్డంకులు సృష్టించారు. ఆయన ఇంట్లో, ఆయన మామ, ఇతర బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు. మఫ్టీలో ఉన్న పోలీసులు తామే అక్కడ డబ్బు పెట్టిన వైనం బట్టబయలైంది. మీడియాలో, సోషల్ మీడియాలో సదరు వీడియోలు వైరల్ కావడంతో కేసీఆర్‌పై జనం కన్నెర్ర చేశారు. వారిలో నెలకొన్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకోవడంలో బీజేపీ శ్రేణులు సఫలమయ్యాయి. కేవలం 1,079 ఓట్ల స్వల్ప మెజారిటీతో రఘునందన్‌రావు గెలిచారు. కానీ గత ఎన్నికల్లో తనకు వచ్చిన మెజారిటీ ఓట్లను కూడా టీఆర్ఎస్ సాధించలేకపోయింది. కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. ఎంతసేపూ ఉద్యమం పేరుచెప్పి మాటలతో కాలక్షేపం చేస్తే లాభం లేదని.. తమకు అభివృద్ధి కావాలని తెలంగాణ జనం కోరుకుంటున్నారని ఈ పరాజయంతో గాని కేసీఆర్‌కు అర్థం కాలేదు. కాగా.. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బీజేపీకి ఈ విజయం బాటలు వేసింది. దీంతో కేడర్ బలంగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్‌పై దృష్టిపెట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సాధారణ కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బిహార్-గుజరాత రాష్ట్రాల ఇన్చార్జి భూపేంద్ర యాదవ్‌ను హైదరాబాద్‌కు పంపింది. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. చివరకు కేంద్ర హోం మంత్రి అమితషా కూడా రోడ్‌షోలు, సభల్లో పాల్గొనడంతో ఇవి లోక్‌సభ ఎన్నికలను తలపించాయి. అటు కేసీఆర్ కూడా స్వయంగా ప్రచార బరిలోకి దిగారు. బీజేపీ గెలిస్తే మత కల్లోలాలు జరుగుతాయని, హైదరాబాద్ బ్రాండ్ నేమ్ దెబ్బతింటుందని హెచ్చరించారు. నిజానికి అక్టోబరులో హైదరాబాద్‌లో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు సంభవించాయి. సహాయ పునరావాస చర్యలు చేపట్టినా.. అవి వరద బాధితులకు సాంత్వన కలిగించే స్థాయిలో లేవు. వరద సాయంపై కేసీఆర్ మాటలకే పరిమితమయ్యారు. బాధితులకు పైసా కూడా అందలేదు. స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ సాయాన్ని దిగమింగారు. పదివేలు ఇవ్వాల్సిన చోట రెండు మూడు వేలు మాత్రమే ఇచ్చి మిగతాది మింగేశారు. దీంతో ఎన్నికల ముంగిట ప్రతి బాధిత కుటుంబం ఖాతాలో పది వేలు వేస్తామని కేసీఆర్ ప్రకటించారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్, ఇతర విపక్షాలు విరుచుకుపడడంతో ఎన్నికల సంఘం ఆ సాయాన్ని ఆపేసింది. దీంతో బీజేపీ నేత సంజయ్ లేఖ రాయడం వల్లే వరద సాయం ఆగిపోయిందని కేటీఆర్ ప్రచారం చేశారు. అయితే నిజానిజాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సఫలమైంది. దీంతో టీఆర్ఎస్కు ఏకపక్షం కావలసిన ఈ ఎన్నికల్లో ఎదురీదాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో సింహభాగం బీజేపీకి వెళ్లడం.. ఉద్యోగుల్లో టీఆర్ఎస్పై నెలకొన్న వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పవచ్చు. మొత్తం 150 డివిజన్లకు గాను టీఆర్ఎస్ గత ఎన్నికల్లో 99 గెలుచుకోగా.. ఈ దఫా అతి కష్టమ్మీద 56 స్థానాల్లో నెగ్గగలిగింది. నాలుగు స్థానాలున్న బీజేపీ.. 48 డివిజన్లలో గెలుపొందింది. 44 స్థానాల్లో ఎంఐఎం తన పట్టు నిలబెట్టుకుంది. కాంగ్రెస్ రెండు డివిజన్లకే పరిమితమైంది. టీడీపీకి ఒక్కటీ రాలేదు.
స్పష్టంగా కనిపించిన ప్రభుత్వ వ్యతిరేకత
జీహెచఎంసీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. దాదాపు సగానికి సగం సిటింగ్ స్థానాల్లో టీఆర్ఎస్ ఓడిపోవడమే ఇందుకు నిదర్శనం. గత ఎన్నికల్లో గెలిచిన 99 మందిలో 72 మందికే ఈసారి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. వారిలోనూ 35 మంది ఓటమి పాలయ్యారు. అంటే, సగానికి సగం సిటింగ్‌లు ప్రజాగ్రహాన్ని చవిచూశారు. తమ తమ డివిజన్లలో ఈ ఐదేళ్లలో కార్పొరేటర్లు ఏమీ చేయలేదని, కొంతమంది అయితే కనీసం ముఖం కూడా చూపించలేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అయినా, మరోసారి వారికి పార్టీ అవకాశం ఇచ్చింది. పార్టీలోని స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు, కొందరు ఎమ్మెల్యేలు, సిటింగ్ కార్పొరేటర్లకు పడకపోవడమూ టీఆర్ఎస్కు నష్టం చేసింది. ఆ పార్టీకి ప్రతికూలంగా మారిన మరో అంశం దాదాపు మూడు నెలలుగా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం. ధరణి పోర్టల్ దెబ్బకు రియల్ ఎస్టేట్ కుదేలైంది. హైదరాబాద్ శివారు డివిజన్లలో ఎక్కువ మందికి రియల్ ఎస్టేట్ వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరు. దీనికితోడు, ఆస్తులు అమ్ముకునే అవకాశం లేకపోవడంతో వ్యాపారాలూ వివాహాది శుభకార్యాలూ నిలిచిపోయాయి. దీనికితోడు, ప్రభుత్వం ప్రకటించిన ఎల్ఆర్ఎస్ స్కీంతో సంబంధితులపై పెద్ద భారమే పడింది. ఇవి కూడా ప్రజాగ్రహానికి కారణం. 2016 ఎన్నికల సమయంలో నిరుపేదలు ఆత్మగౌరవంగా నివసించేందుకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఐదేళ్లలో కేవలం 2,500 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు అందజేసింది. 40 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయలేదు. టీఆర్‌ఎ్‌సపై వ్యతిరేకతకు ఇది మరో కారణమని విశ్లేషిస్తున్నారు. గత ఐదేళ్లలో రోడ్లకు రూ.600 కోట్లు ఖర్చు చేసినా.. వాటిలో నాలుగో వంతు మాత్రమే కాలనీ రోడ్లకు ఖర్చు చేశారు. వరదల దెబ్బకు అవి కూడా సర్వనాశనమయ్యాయి. వరదల సమయంలో.. ఆ తర్వాత కొన్ని ప్రాంతాలకు వెళ్లడానికి అసలు దారే లేదు. రోడ్లకు సంబంధించి ప్రజల ఆగ్రహం ఎన్నికల్లో ప్రతిఫలించింది. ఇక నిరుద్యోగులు కూడా టీఆర్‌ఎ్‌సకు వ్యతిరేకంగా పని చేశారు. ఆంధ్రులు ఎక్కువగా ఉన్న కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లోని ఎక్కువ డివిజన్లలో టీఆర్ఎస్ గెలవడం విశేషమే. హైదరాబాద్ బ్రాండ్‌నేమ్ దెబ్బతింటుందన్న భయంతో వారు అధికార పార్టీ వైపే మొగ్గుచూపారు. ఏమైనా గ్రేటర్ ఎన్నికలతో తెలంగాణలో బీజేపీయే ప్రధాన ప్రత్యామ్నాయంగా మారిందన్నది నిర్వివాదం.
మేయర్ పీఠం అంత తేలిక కాదు..
గత ఎన్నికల తర్వాత గ్రేటర్ మేయర్ పీఠాన్ని గెలుచుకున్న టీఆర్‌ఎ్‌సకు ఈసారి నల్లేరుపై బండి నడక కాదు. ప్రస్తుతానికి ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపితే ఆ పార్టీ మొత్తం ఓట్లు 90 మాత్రమే. మేయర్ పదవి దక్కించుకోవడానికి కావాల్సిన మేజిక్ మార్కు దాదాపు 100. ఆకర్షించడానికి ఈసారి స్వతంత్రులూ లేరు. దాంతో గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవడానికి మజ్లిస్ మద్దతు తీసుకోవడం అనివార్యంగా కనిపిస్తోంది. అదే జరిగితే టీఆర్ఎస్-మజ్లిస్ అపవిత్ర పొత్తుపై బీజేపీ ప్రచారం చేసి.. తెలంగాణలో మరింత బలపడుతుందని కేసీఆర్ భయపడుతున్నారు. ఫిబ్రవరి వరకు గడువు ఉన్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఏం చేస్తుందో వేచిచూడాల్సిందే!