సంచలన రాజకీయ కథనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ప్రతి వారాంతంలోనూ ఆ పత్రిక యజమాని రాధాక్రిష్ణ అలియాస్ ఆర్కే.. తన వీకెండ్ కామెంట్ పేరుతో రాజకీయ విశ్లేషణ చేస్తుంటారు. ఆ సందర్భంగా తన వరకు వచ్చిన చాలా అంశాల్ని ప్రస్తావిస్తుంటారు. హైప్రొఫైల్ వర్గాల్లో జరుగుతున్న రాజకీయ చర్చలతో పాటు.. తనతో మాట్లాడే చాలామంది రాజకీయ నేతలు.. ఉన్నతాధికారులు అందించే సమాచారాన్ని ఆయన ప్రస్తావిస్తుంటారు. అలాంటి ఆర్కే.. తాజాగా సంచలన కథనాన్ని రాశారు.
ఇప్పటివరకు జగన్ సంధించిన బాణం.. షర్మిల అనే మాటకు భిన్నంగా.. జగన్ పైకి షర్మిల బాణాన్ని ప్రయోగించారు ఆర్కే. ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత.. ఆయన సోదరి షర్మిల తెర మీదకు రాని విషయం తెలిసిందే. అయితే.. అన్నా చెల్లెళ్ల మధ్య పంచాయితీ బాగా ముదిరిపోయిందని.. ఇప్పుడు షర్మిల వేరే కుంపటి పెట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. షర్మిల తరఫున ఆమె తల్లి విజయమ్మ కూడా ఉంటారని చెబుతున్నారు.
తాను అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లిని ఎంపీని చేస్తామని చెప్పారని.. తెలంగాణలో పార్టీని పెట్టి.. దానికి అధ్యక్షురాలిగా నియమిస్తానని మాట ఇచ్చిన జగన్.. అదేమీ చేయని తీరుపై షర్మిల ఆగ్రహంతో ఉన్నట్లుగా పేర్కొన్నారు.
అన్న జైలుకు వెళ్లినప్పుడు దాదాపు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి.. జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్న తనను అన్న జగన్ నిర్లక్ష్యం చేయటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు.
తాము ఆశించినట్లుగా రాజన్న రాజ్యాన్ని కాకుండా.. తమిళనాడు తరహాలో రాజకీయాన్ని తీసుకొచ్చారని.. ఈ తీరుపై విజయమ్మ సైతం జీర్ణించుకోలేకపోతున్నట్లుగా చెబుతున్నారు.
తన తండ్రి హయాంలో ప్రారంభించిన వ్యాపారాల్లో కూడా తన పాత్ర లేకుండా చేసినందుకు అన్నపై షర్మిల మండిపడుతున్నారా? తాను ఏమిటో రుజువు చేసుకోవటానికి తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభించాలని షర్మిల నిర్ణయించుకున్నారా? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుందన్న విషయాన్ని ఆయన వెల్లడించారు.
అన్నా చెల్లెళ్ల మద్య పంచాయితీ కొద్దికాలంగా ఉన్నా.. ఇటీవల అది మరింత ఎక్కువైందన్న విషయాన్ని ఆయన తన కాలమ్ లో రాసుకొచ్చారు. తానేమిటో అన్నకు చూపించాలన్న పట్టుదలతో ఉన్న షర్మిల.. తెలంగాణలో సొంత రాజకీయ పార్టీని ప్రారంభించాలని దాదాపుగా నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. బహుశా ఫిబ్రవరి 9న రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లుగా ఆమె తన సన్నిహితుల వద్ద చెప్పినట్లుగా ఆర్కే పేర్కొన్నారు.
విలేకరుల సమావేశాన్ని షర్మిల ఏర్పాటు చేస్తారని.. దానికి విజయమ్మ కూడా హాజరవుతారని వారి సన్నిహితులు చెబుతున్నట్లుగా తెలిపారు. తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ అని తాను ప్రారంభించే రాజకీయ పార్టీకి పేరు కూడా డిసైడ్ చేసినట్లుగా ఆయన తన కథనంలో రాసుకొచ్చారు.
తన తండ్రి సీఎంగా ఉన్న వేళలో.. ఆయనతో సన్నిహితంగా.. నమ్మకంగా ఉన్న పలువురు నేతలు.. కుటుంబ శ్రేయోభిలాషులకు షర్మిల కొద్దిరోజులుగా ఫోన్లు చేస్తూ మద్దతు ఇవ్వాల్సిందిగా ఆమె కోరుతున్నట్లుగా చెబుతున్నారు.
వైఎస్ కు సెంటిమెంట్ అయిన చేవెళ్లలోనే తన రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని.. అక్కడి నుంచే తెలంగాణ మొత్తం పాదయాత్రతో చుట్టివస్తానని ఆమె తన సన్నిహితుల వద్ద చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. అయితే.. తెలంగాణలో చెల్లి చేత పార్టీ పెట్టించే విషయంలో ఏపీ సీఎం జగన్ సుముఖంగా లేరని.. కేసీఆర్ తో గొడవ పెట్టుకోవటానికి ఆయన సిద్ధంగా లేరని పేర్కొన్నారు. తెలంగాణలో పార్టీని ప్రారంభించాలని షర్మిల నిర్ణయించుకున్న విషయం తెలుసుకున్న జగన్.. ఆమెతో ఆ ప్రయత్నాన్ని విరమింపజేయటానికి జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని పేర్కొన్నారు.