రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నా కేంద్రం విభజన హామీలను అమలు చేయలేదని… హామీల అమలు కోసం అందరం కలిసి కేంద్రం పై పోరాటం చేయాలని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఆమె సీఎం జగన్, చంద్రబాబులకు బహిరంగంగా లేఖ రాశారు. విభజన హామీల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్రానికి పంపాలని కోరారు.
ఏపీ విభజన హామీల అమలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల హక్కు అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లుగా వీటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ఆమె విమర్శించారు. రాష్ట్రాన్ని ఇంకా మోసం చేస్తూనే ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని అన్నారు.
కేంద్రానికి విభజన హామీలను గుర్తు చేస్తూ పోరాటం సాగించాలని చెప్పారు.విభజన హామీలపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి పంపాలని లేఖలో ఆమె సూచించారు. తన లేఖలో తమ డిమాండ్లను మీ ముందుంచామని చెప్పారు. మీమీ పార్టీల తరపున అసెంబ్లీ వేదికగా చర్చించాలని అన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా అందరం చేయాల్సిన పోరు అని చెప్పారు.
అయితే.. షర్మిల లేఖఫై విమర్శలు వస్తున్నాయి. అధికారంలో ఉన్న తన సోదరుడు జగన్ ను అడగాల్సింది పోయి చంద్రబాబును కూడా ఇందులోకి లాగడం ఎందుకన్న విమర్శలు వస్తున్నాయి.
అంతేకాదు… 22 మంది ఎంపీలున్న వైసీపీ విభజన హామీలపై పార్లమెంటులో ఏనాడూ కేంద్రాన్ని నిలదీసిన దాఖలాలు లేవు.
కేంద్రానికి ఏ బిల్లుల విషయంలో అవసరం వచ్చినా వైసీపీ సపోర్ట్ చేస్తుందే కానీ ఏనాడూ రాష్ట్రానికి అవసరమైన డిమాండ్లు సాధించుకునే ప్రయత్నాలు చేయలేదు.
ఇలాంటి పరిస్థితిలో అన్నను వదిలేసి చంద్రబాబును అడగడం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తోంది.