రాజకీయాల్లో క్షణక్షణం మారుతున్న పరిణామాలకు అనుగుణంగా నాయకుల స్థానాలు మారుతాయి. జాతకాలు మారిపోతుంటాయి. ఖమ్మం జిల్లా నేలకొండ పల్లిలో షర్మిల చేసిన ప్రకటన కూడా ఇలాంటిదే ! వచ్చే ఎన్నికల్లో తాను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పి సంచలనం అయ్యారు.
ఇప్పటిదాకా ముఖ్య నేతల స్థానాలే కన్ఫం కాని సందర్భంలో తన వరకూ తాను తనదైన స్పష్టత ఇస్తూ.. వచ్చే ఎన్నికల విషయమై ఓ క్లారిఫికేషన్ ఇచ్చారు. ఓ విధంగా ఇటువంటి పనులు చేయడం ఆమె స్థాయి నేతలకు ఒకందుకు మంచిదే ! అన్న వాదన కూడా వినిపిస్తోంది.
రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నేతలను ఢీ కొనే పనులు కొన్ని షర్మిల చేస్తున్నారు. ఇవి ఎలాంటి ఫలితాలు ఇచ్చినా ప్రస్తుతానికి అయితే ఆమె మాటలు ప్రజలు వింటున్నారు. ఇక ఓటు ఎవరికి వేస్తారో అన్నది అప్రస్తుతం.
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ముందు నుంచి ఖమ్మంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే అక్కడ పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఒక సభ కూడా అక్కడ పెట్టారు. ఇప్పటికే తెలంగాణ వాకిట పాదయాత్రతో జనానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న షర్మిల రానున్న కాలంలో మరింత దూకుడుగా వ్యవహరించి రాష్ట్ర రాజకీయాలలో కీలకం కావాలన్న ఆశతో ఉన్నారు. కానీ తెలంగాణలో పోటీ ఎవరెవరి మధ్య ఉందో అందరికీ తెలిసిందే.
పార్టీ గెలవడం, ఓడిపోవడం అన్నవి అటుంచితే ఆడ పులిలా కేసీఆర్ విధానాలను తరుచూ ప్రశ్నిస్తూ, ఆయన్ను ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తుండడం వల్ల అప్పుడప్పుడు వార్తల్లో మెరుస్తున్నారు. అయితే నిర్మాణాత్మక విమర్శలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమెకు సూచనలు వస్తున్నాయి.
జగన్ కి షర్మిలకు గొడవలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. కాదు కాదు, అన్న జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ కూడా ఆమెకు ఉందంటున్నారు కొందరు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు (తెలంగాణ కేంద్రంగా ఉండే శ్రేణులు) షర్మిలకే మద్దతు ఇస్తారు అన్నది కూడా వాస్తవం. సోషల్ మీడియా గమనించినా కూడా ఇది తెలిసిపోతుంది.
జగన్ షర్మిలను ట్రయల్ కింద వదిలాడు… ఆమె హిట్టయితే దానిని భవిష్యత్తులో వైసీపీలో విలీనం చేస్తారు.. లేదంటే ఆ పార్టీని మూసేస్తారు. చాలా వ్యూహాత్మకంగా జగన్ ఆడిన గేమ్ ఇదని కొందరు అనుమానిస్తున్నారు.