వైస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం మహబూబా బాద్‌లో పాదయాత్ర చేస్తున్న ఆమెను అరెస్టు చేయడంతో పాటు.. హైదరాబాద్‌కు తరలించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. షర్మిలకు నోటీసులు ఇచ్చారు. అనంతరం మహబూబాబాద్‌లో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోని అరెస్ట్ చేశారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారని షర్మిలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
శనివారం సాయంత్రం మహబూబాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అవినీతి, అక్రమాలు, భూ కబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే, కేసీఆర్‌కు మిత్రుడు.. బీఆర్ ఎస్ ఎస్టీ నేత బానోతు శంకర్‌నాయక్‌ను పరుష పద జాలంతో షర్మిల దూషించారని ఆ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లూనావత్ అశోక్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఈక్రమంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే బీఆర్ ఎస్ కార్యకర్తలు.. ఎమ్మెల్యే అనుచరులు కూడా షర్మిల బస చేసిన ప్రాంతం మహబూబాబాద్ మండలం బేతాలు శివారుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. షర్మిల డౌన్ డౌన్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. షర్మిల వ్యాఖ్యలను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం తండా వద్ద 365 జాతీయ రహదారి పై ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో శ్రేణులు భారీ రాస్తారోకో చేపట్టాయి.
వైఎస్ షర్మిల ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. శ్రేణులు షర్మిల బస చేసిన గుడారాలపై దాడి చేస్తారో మోనని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగాకుండా పోలీసులు భారీగా మోహరించారు. కోర్ట్ ఉత్తర్వులను ధిక్కరించి షర్మిల ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో షర్మిల యాత్రకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు.