ఈ సోషల్ మీడియా జమానాలో సెలబ్రిటీలు, సినీతారలు, క్రీడాకారులు మాట్లాడిన మాటలు క్షణాల్లో ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైపోతున్నాయి. ఇక, వారు చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా వివాదాస్పద అంశం ఉంటే అది సెకన్లలో వైరల్ అయిపోతుంది. అందుకే, వారు మీడియాలో, సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. లేకుంటే చిక్కులు తప్పవు. ఈ క్రమంలోనే గత ఏడాది టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ పై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే.
టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మతో కలిసి ఓ లైవ్ సెషన్ సందర్భంగా చహల్ సామాజిక వర్గంపై కామెంట్లు చేశాడు. దానిపై దుమారం రేగడంతో తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని వివరణ ఇచ్చాడు. తన మాటల వల్ల మనోభావాలు దెబ్బతింటే క్షమించాలని కోరాడు. ఈ వివాదం సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో తాజాగా ఈ వ్యవహారం నేపథ్యంలో యువరాజ్ సింగ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.
యువరాజ్ వ్యాఖ్యలు కుల అహంకారాన్ని సూచిస్తూ నిమ్న కులాలను కించపరిచేలా ఉన్నాయంటూ ఓ న్యాయవాది హర్యానా పోలీసులను ఆశ్రయించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో, త్వరలోనే యువీకి నోటీసులు పంపి విచారణ జరుపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. యువీపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ తో పాటు, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ ఫిర్యాదు ప్రకారం ఉన్నతాధికారులు, విచారణ జరిపి, ప్రాథమిక సాక్ష్యాలున్నాయని నిర్ధారించుకుని కేసు నమోదు చేశారు. యువరాజ్ పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 153, 153 ఏ, 295, 505 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ లోని 3 (1) (ఆర్), 3 (1) (ఎస్) కింద కేసు పెట్టినట్టు అధికారులు వెల్లడించారు. మరి, ఈ వ్యవహారంపై యువీ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.