త్వరలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై సీఎం మమతా బెనర్జీ గట్టిగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ పెద్దలు అమిత్ షా, నడ్డా వంటివారిని ఢీకొట్టేందుకు సైతం వెనుకాడని దీదీ….ఈ ఎన్నికల్లో బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టి మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఓ సభలో ప్రసంగించిన దీదీ…ఢిల్లీలోని బీజేపీ పెద్దలపై విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో కొంతమంది నేతలు బెంగాల్ వెన్ను విరవడం ఎలానో తమకు తెలుసని అంటున్నారని, కానీ, తమ కళ్లు పెకలించడం, వెన్ను విరచడం అంత తేలికైన విషయం కాదని దీదీ నిప్పులు చెరిగారు. బంగ్లా నినాదంతో బెంగాల్ వెన్నెముక బలం చూపాలని ఇకపై ఫోన్లో మాట్లాడేటప్పుడు హలో అని కాకుండా జై బంగ్లా అనాలని బెంగాల్ ప్రజలకు దీదీ పిలుపునిచ్చారు. బెంగాల్ లో దీదీ కూడా జై శ్రీరామ్ అంటారని అమిత్ షా అన్న వ్యాఖ్యలకు కౌంటర్ గా దీదీ ఈ పిలుపునివ్వడం గమనార్హం.
హిందూత్వ ఎజెండాను బలంగా నమ్ముకున్న బీజేపీ అదే ఫార్ములాతో బెంగాల్ లోనూ పాగా వేయాలనుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జై బంగ్లా అంటూ లోకల్ సెంటిమెంట్ ను దీదీ తెరపైకి తెచ్చారన్న వాదన వినిపిస్తోంది. గతంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హిందుత్వ ఎజెండాను తీసుకెళ్లడంలో కొంతవరకు సక్సెస్ అయిన నేపథ్యంలో దీదీ…ముందు జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.
మరోవైపు, ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకునేందుకు దీదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్ ధరలపై విధిస్తున్న పన్నును ఒక రూపాయి తగ్గించారు. పెట్రో ధరల తగ్గింపు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న మరుసటి రోజే దీదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.