పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట విషాదంతో హీరో అల్లు అర్జున్ ఎంత పెద్ద వివాదంలో చిక్కుకున్నాడో.. ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నాడో తెలిసిందే. అరెస్ట్ సమయంలో బన్నీకి సానుభూతి వచ్చినా.. తదనంతర పరిణామాలతో అతను చిక్కుల్లో పడ్డాడు. అన్ పాపులర్ అయ్యాడు. ఈ వ్యవహారం ఒక దశ దాటాక తెలంగాణ వెర్సస్ ఆంధ్రగా మారిపోయిన సంకేతాలు కూడా కనిపించాయి.
తాజాగా బన్నీని టార్గెట్ చేస్తూ తెలంగాణ జానపద గేయం ఒకటి తయారైంది. అందులో బన్నీ పేరెత్తకుండా.. ఇటీవల పరిణామాల నేపథ్యంలో అతణ్ని టార్గెట్ చేస్తూ లిరిక్స్ పెట్టారు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని కొందరు సమర్థిస్తుంటే.. కొందరు బన్నీ మీద ఇంతగా దాడి చేయాలా.. సున్నితమైన అంశంలో ఇలాంటి పాటలు రూపొందించడం ఏంటి అని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకీ ఆ పాట లిరిక్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం పదండి.
‘‘టికెట్లు మేమే కొనాలే.. చప్పట్లు మేమే కొట్టాలే..
చావులు మేమే చావాలే. సంపాదన మీదే కావాలే..
పైసాతోనే పాణం కొంటరా పెద్ద మనుషులు..
మీ పైసాతోనే పాణం కొంటరా పెద్ద మనుషులు..
మీ వల్లే చచ్చిన మనిషిని చూడ రావు మనసులు..
ముందేమో కన్నీళ్లెట్టాలే.. ఎనకేమో బూతులు తిట్టాలే..
పైకేమో పేమలు చూపాలే.. లోపలా కసురుకోవాలే..
జైలుకెళ్లిన భగత్ సింగ్లా పోజులు కొట్టాలే..
నీ గేటు ముందు పోటుగాళ్లు క్యూలుగట్టాలే..
సెల్ఫీలు మేమే అడగాలే.. సెంపలు మావే బలగాలే..
కటౌట్లు మేమే గట్టాలే.. గెటౌట్లు మాకే దక్కాలే..
బౌన్సర్లతో బలుపు సూపి బయటికి నూకాలే..
జర యాదుంచుకో ఏ సినిమనైనా మేమే దేఖాలే..
ఇలా సాగాయి ఈ పాటలో లిరిక్స్. ఈ సాహిత్యం చాలదన్నట్లు ‘పుష్ప’ మేనరిజమ్స్‌ను ప్రదర్శిస్తూ.. అభిమానులతో పైకి నటిస్తూ వెనుక చీదరించుకున్నట్లుగా సన్నివేశాలు కూడా పెట్టారు. ఇప్పుడీ పాట మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చేనడుస్తోంది.