తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రాయశ్చిత్త, పాపపరిహార దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని ఎన్నారై టీడీపీ నేతల ఆధ్వర్యంలో శాంతి హోమం నిర్వహించారు. మిలిపిటాస్ లోని వేదా ఆలయంలో ఈ హోమం చేపట్టారు. లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలతో తయారు చేసిన నెయ్యి వాడిన మహా పాపానికి పరిహారంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల టీడీపీ ఎన్నారై అధ్యక్షులు జయరాం కోమటి ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం నిర్వహించారు.
శ్రీకాంత్ దొడ్డపనేని, తులసి తుమ్మల, సుబ్బా యంత్రా, వెంకట్ అడుసుమల్లి తదితరుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ బే ఏరియా, ఎన్నారై జనసేన, ఎన్నారై బీజేపీ నేతలు పలువురు కుటుంబసమేతంగా పాల్గొన్నారు. పండితుల వేద మంత్రాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది.
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న స్వామి ప్రసాదాన్ని హిందువులంతా పరమ పవిత్రంగా భావిస్తుంటారని, అటువంటి మహా ప్రసాదాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని ఎన్నారై టీడీపీ నేతలు మండిపడ్డారు. కమీషన్లకు కక్కుర్తి పడి టీటీడీ పరువును, వెంకన్న పవిత్రతను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.