సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ దాదాపు పూర్తి కావచ్చిన సంగతి తెలిసిందే. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం తీవ్ర చర్చనీయాంశమైంది. వివేకా మర్డర్ వెనుక ఉన్న కీలకమైన వ్యక్తి డి.శంకర్‌రెడ్డి అని ప్రచారం జరుగుతోంది. ఇక, వివేకా హత్య తర్వాత ఆయన ఇంటికి ముందుగా వెళ్లింది శంకర్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డిలేనని….అవినాష్ కు శంకర్ రెడ్డి చాలా క్లోజ్ అని టాక్ వస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా వివేకా హత్య కేసులో కీలక పురోగతి లభించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన అనుమానితుడు దేవిరెడ్డి శివ శంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పులివెందులకు చెందిన శంకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో చికిత్స కోసం రెండ్రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పటల్లో ఉన్న శంకర్ రెడ్డిని సీబీఐ బృందం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
గతంలో, వైఎస్ సునీత హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో కూడా శంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కర్ రెడ్డిల ప్రస్తావన ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా శంకర్ రెడ్డి అరెస్టుతో ఈ కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇక, ఈ కేసులో అవినాష్ రెడ్డి పేరు కూడా వచ్చినందున ఆయనను కూడా విచారణ చేయాలని, అవినాష్ రెడ్డితో పాటు జగన్ ను కూడా విచారణ జరపాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
వివేకా హత్య రోజు స్పాట్ కు ముందుగా చేరుకున్న అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలు… సాక్ష్యాలు తారుమారు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముందుగా గుండెపోటుగా ఈ మర్డర్ ను చిత్రీకరించారని ఆరోపించారు. ఈ కేసులో సిట్‌ను రెండుసార్లు మార్చి కేసును జగన్ నీరుగార్చే ప్రయత్నం చేశారని షాకింగ్ ఆరోపణలు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ కేసు ఏ మలుపు తిరగబోతోందోనన్న ఆసక్తి ఏర్పడింది.