`పుష్ప-2` ప్రీమియర్ షో విడుదల సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా ధియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం.. రేవతి అనే మహిళ మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ తో పాటు పలువురిపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే సంధ్య ధియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. దీనిపై స్పందించిన ధియేటర్ యాజమాన్యం.. పోలీసులకు రిప్లయ్ ఇచ్చింది. ఆ రోజు ఏం జరిగిందో తమకు తెలియదని పేర్కొంది.
“డిసెంబరు 4న ధియేటర్ నిర్వహణ మా చేతుల్లో లేదు. మొత్తం మైత్రీమూవీ మేకర్స్ సంస్థ వారు తీసుకు న్నారు. అయితే.. మా సిబ్బంది మాత్రం 80 మంది అక్కడే విధుల్లో ఉన్నారు. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. అల్లు అర్జున్ వస్తున్నట్టు మాకు సమాచారం ముందు రోజు ఉంది. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాం. పార్కింగ్ ఏరియాను రెండుగా విభజించి.. బైకులు, స్కూటర్లకు, కార్లకు వేర్వేరుగా ఉంచాం. ఇది రోజూ ఉండే నిబంధనే“ అని తన వివరణలో సంధ్య ధియేటర్ యాజమాన్యం స్పష్టం చేసింది.
తొక్కిసలాట సమయంలో తమ నిర్వహణ లేదని పేర్కొంది. ఈ నెల 4, 5 తేదీల రోజుల్లోనూ పుష్ప-2 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్వహణను తీసుకుందని, సాధారణంగా పెద్ద సినిమాల విడుదల సందర్భంగా తమ సినిమా హాలుకు అగ్ర హీరోలు వస్తూనే ఉంటారని.. ఎప్పుడూ తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు 6 పేజీలతో కూడిన వివరణ లేఖను అందించింది.
దీనిలో టికెట్ల బుకింగ్ కౌంటర్ల నుంచి పార్కింగ్ ఏరియా వరకు, అదేవిధంగా హాల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి.. ఆ రోజు రద్దీ ఏ స్థాయిలో ఉంది.. ఎంత మందిని నిర్వహణకు ఉంచారనే వివరాలను సమగ్రంగా వివరించింది. దీనిని పోలీసులకు పంపించిన యాజమాన్యం విచారణకు అన్ని విధాలా సహకరిస్తామని స్పష్టం చేసింది.