వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, ప్రైవసీకి భంగం కలిగించేలా వాట్సాప్…కొత్త నిబంధనలు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కొత్త నిబంధన వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందంటూ విమర్శలు వస్తున్నాయి. దీంతో, తాము వినియోగదారుల సమాచారాన్ని ఫేస్ బుక్ కు షేర్ చేయబోమని వాట్సాప్ చెబుతోంది. అయినప్పటికీ, వాట్సాప్ గోప్యతా విధానం పై ప్రజలకు నమ్మకం కలగడం లేదు.
ఈ నేపథ్యంలోనే వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా కేంద్రప్రభుత్వం ‘సందేశ్’ యాప్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా సందేశ్ యాప్ ప్లేస్టోర్ లో నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్(ఎన్ఐసీ) లాంచ్ చేసిన సందేశ్ ను ఉపయోగించాలంటే మొబైల్ నంబర్ లేదా ప్రభుత్వ ఈ-మెయిల్ ఐడీ తప్పనిసరి. వాట్సాప్ తరహాలోనే ఇందులో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండనుంది.
ప్రభుత్వ జీఐఎంఎస్ పోర్టల్‌లో సందేశ్ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐవోఎస్ యాప్ స్టోర్‌లో ఐఫోన్, ఐప్యాడ్, ఐపోడ్ యూజర్లకు సందేశ్ అందుబాటులో ఉండనుంది. కనీసం ఆండ్రాయిడ్ 5.0, ఐవోఎస్ 12.0 ఆపరేటింగ్ సిస్టం లేదా అంతకంటే పై వెర్షన్ ఉన్న డివైస్‌ల్లో ఇది పనిచేయనుంది. జీమెయిల్, హాట్‌మెయిల్, ఇతర ఈ-మెయిల్లను ఈ యాప్ తీసుకోదు. ప్రభుత్వానికి సంబంధించిన మెయిల్ ఐడీల్లో కూడా @mygov.in డొమైన్ ఐడీలను కాకుండా కేవలం @gov.in ఎక్స్‌టెన్షన్‌తో ఉన్న ఈమెయిల్ ఐడీలను మాత్రమే ఈ యాప్ తీసుకుంటుంది.
ఫోన్ నంబర్ తో రిజిస్టర్ అయితే ఏ ఇబ్బంది ఉండదు. సందేశ్‌లో చాట్ బ్యాకప్‌లను ఈమెయిల్‌కే కాకుండా.. ఎక్స్టర్నల్ లొకేషన్‌కు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఒకసారి సైన్ అప్ అయిన మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీనే ఉపయోగించాల్సి ఉంటుంది. ఒకవేళ వేరే నంబర్‌తో ఉపయోగించాలనుకుంటే ఈ ఖాతా డిలీట్ చేసి వేరే నంబర్‌తో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజల్లో సందేశ్ ఎంతవరకు క్లిక్ అవుతుందో వేచి చూడాలి.