సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్. టాలీవుడ్ బ్యూటీ సమంత అనారోగ్యంపై కొంతకాలంగా రకరకాల రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వయంగా సమంత తన అనారోగ్యం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పింది. దీంతో సమంత త్వరగా కోలుకోవాలని ఆమె ఆరోగ్యం కుదుటపడాలని ఆమె అభిమానులు, సినీ, రాజకీయ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు కోరుకున్నారు.
అయితే, అదే సమయంలో కొంతమంది ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో సమంత ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తి చేశారు. సమంత ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతోందని, ఎక్కువ కాలం బ్రతకదని రకరకాల కథనాలను ప్రసారం, ప్రచురితం చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా యశోద చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఆ వ్యాఖ్యలపై స్పందించింది. తాను, ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు కొందరు వార్తలు రాశారని, తాను ఇంకా చావలేదని సమంత ఎమోషన్ అయింది.
వారు రాసిన వార్తల్లో నిజం లేదని, ప్రస్తుతానికి తాను ప్రాణాపాయ స్థితిలో లేనని సమంత కంటతడి పెట్టింది. ప్రపంచంలో మయాసైటిస్ వ్యాధిని చాలామంది సమర్థవంతంగా ఎదుర్కొన్నారని, తాను కూడా ఆ వ్యాధిని దీటుగా ఎదుర్కొంటానని సామ్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తూ తీవ్ర బావోద్వేగానికి గురైంది. మన చేతుల్లో ఏదీ ఉండదని, లైఫ్ డిసైడ్ చేస్తుందని సామ్ వేదాంతం చెప్పుకొచ్చింది. అయితే, తాను ఇప్పుడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నానని, అందరి జీవితాల్లో మంచి చెడు రోజులు ఉంటాయని సమంత చెప్పింది. ఒక్కోసారి తన అడుగు తీసి అడుగు కూడా వేయలేనేమో అనిపిస్తుందని, కానీ, తాను ఈ వ్యాధితో పోరాడి గెలుస్తానన్న ధీమా తనకుందని సమంత చెప్పుకొచ్చింది.