బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్ హీరో. హిందీలో ‘యానిమల్’, ‘ఛావా’ లాంటి బ్లాక్ బస్టర్లలో నటించిన రష్మిక మందన్నా హీరోయిన్.. ఒకప్పుడు హిందీలో ‘గజిని’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మురుగదాస్ దర్శకుడు.. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం.. `సికందర్`. ఈ రోజే రంజాన్ కానుకగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. కానీ థియేటర్లలో విడుదల కావడానికి ముందే ఈ మూవీ ఆన్ లైన్లో లీక్ అయిపోవడం బాలీవుడ్‌కు పెద్ద షాక్. సినిమా రిలీజయ్యాక ఆ రోజు రాత్రికి పైరసీ ప్రింట్ బయటికి రావడం ఈ మధ్య చాలా సినిమాలకు జరిగింది. కానీ ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం అంటే అంతకంటే దారుణం ఇంకేముంటుంది? ఇలా ఎలా జరిగిందన్నది అర్థం కాని విషయం. బహుశా వేరే దేశానికి పంపిన ఏదో ఒక ప్రింట్ నుంచే పైరసీ జరిగి ఉండొచ్చు.
అసలే ‘సికందర్’ ట్రైలర్ అంతగా ఆకట్టుకోలేదు. మురుగదాస్, సల్మాన్ ఖాన్ల ట్రాక్ రికార్డు కూడా బాలేదు. దీంతో సినిమా అనుకున్నంతగా ఆడుతుందో లేదో అన్న అనుమానాలు కలిగాయి. దీనికి తోడు ఈ రోజు ఉదయం షోల నుంచి బ్యాడ్ టాక్ వచ్చింది. సినిమా డిజాస్టర్ అని రివ్యూలు చూస్తే అర్థమవుతోంది. ఇది చాలదన్నట్లు పైరసీ ప్రింట్ ఆన్ లైన్లోకి వచ్చేసింది.
ఇక ‘సికందర్’ సినిమా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండబోతోందో చెప్పేదేముంది? గతంలో సల్మాన్ హీరోగా బ్లాక్ బస్టర్లు కొట్టిన సాజిద్ నడియాడ్వాలా ఈ సినిమాతో చేదు అనుభవాన్ని ఎదుర్కోబోతున్నాడు. విడుదలకు ముందే హెచ్డీ ప్రింట్ బయటికి వచ్చిందంటే ఓటీటీ డీల్ చేసుకున్న స్ట్రీమింగ్ సంస్థ ఊరుకుంటుందా అన్నది ప్రశ్న. అసలే సినిమాకు టాక్ కూడా చాలా బ్యాడ్‌గా ఉంది. ఈ నేపథ్యంలో రేటు తగ్గించాలని కోరొచ్చు. మరోవైపు బయ్యర్లు దారుణమైన నష్టాలు చవిచూసేలా ఉండడంతో సాజిత్ వారికి సెటిల్ చేయాల్సిన పరిస్థితీ రావచ్చు. మొత్తానికి ‘సికందర్’తో ఈ సీనియర్ నిర్మాత గట్టి దెబ్బే తినేలా ఉన్నాడు.