ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సాక్షి టీవీ చానల్ కు భారీ ఎదురుదెబ్బ తగిలిందా? అంటే అవునన్న మాటను చెబుతున్నారు. కేంద్ర సమాచార.. ప్రసార శాఖ షాకిచ్చిందంటూ ఒక ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది.
సాక్షి టీవీ చానల్ కు జారీ చేసిన అనుమతిని రద్దు చేసిందని.. అంతేకాదు దేశంలో అనుమతించిన చానళ్ల జాబితా నుంచి సాక్షిని తొలగించినట్లుగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఆదేశాలు జనవరి 20న విడుదలైనట్లుగా పేర్కొంది. దీనికి కారణం సాక్షి చానల్ కు కేంద్ర హోం శాఖ ఇవ్వాల్సిన సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవటమేనని చెబుతున్నారు.
కొన్ని ప్రమాణాలకు లోబడి మాత్రమే చానళ్లకు కేంద్ర మంత్రిత్వ శాఖ సెక్యూరిటీ క్లియరెన్సును జారీ చేస్తుంది. తాజాగా సాక్షి చానల్ విషయంలో మాత్రం ఏం జరిగిందన్నది స్పష్టత లేనప్పటికీ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మాత్రం అనుమతుల్ని రద్దు చేసింది. అయితే.. ఎందుకు అనుమతులు రద్దు చేశారన్న విషయం మీద మాత్రం స్పష్టత రాలేదు.
సదరు మీడియా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే.. జనవరి 20న కేంద్ర సమాచార ప్రసార శాఖ సాక్షి టీవీ చానల్ కు అనుమతుల్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2006 జూన్ 7న ఇందిరా టెలివిజన్ లిమిటెడ్ సంస్థ.. సాక్షి టీవీ పేరుతో చానల్ ను నిర్వహించేందుకు అప్లికేష్ పెట్టుకుంది. దీనికి పదేళ్ల పాటు అనుమతులు జారీ చేశారు. అనుమతులు ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత మరోసారి అనుమతుల రెన్యువల్ కోసం అప్లికేషన్ పెట్టుకుంది.
ఇదిలా ఉంటే.. అనూహ్యంగా సాక్షి టీవీని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని 2021 డిసెంబరు 31వ తేదీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. దీనికి సదరు సంస్థ జనవరి 13న సమాధానం ఇచ్చింది. అయితే.. ఏం జరిగిందో కానీ సాక్షి టీవీ చాన్ లకు అనుమతుల్ని పునరుద్దరించలేమని పేర్కొంటూ రద్దు చేస్తున్నట్లుగా పేర్కొంది.
అంతేకాదు.. దేశంలో అనుమతించిన ప్రైవేటు చానళ్ల జాబితా నుంచి సాక్షి టీవీ పేరును తొలగిస్తున్నట్లుగా స్పష్టం చేసింది. దీంతో ఈ చానల్ సిబ్బంది హుటాహుటిన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
చానల్ లో ప్రత్యక్షంగా.. పరోక్షంగా 600 మంది ఉపాధి పొందుతున్నట్లుగా పేర్కొని.. ఉద్యోగుల ప్రయోజనాల్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరారు. దీంతో.. ఈ ఆదేశాలపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణకు మార్చి 11కు వాయిదా వేసింది. దీంతో.. పెద్ద గండం తాత్కాలికంగా తప్పినట్లైంది.