వైసీపీ సానుభూతి పరులుగా మారి కొందరు చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు సమాజంలో కల్లోలం సృష్టిస్తున్నాయని కర్నూలు జిల్లా పోలీసులు తెలిపారు. దీని వెనుక వైసీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కుమారు డు సజ్జల భార్గవ రెడ్డి ఉన్నట్టు చెప్పారు. ఆయనే అన్నీ నడిపించారన్నారు. ఈ మేరకు.. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్, కడప ఇంచార్జ్ ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు తదితరులు తాజాగా మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను , వారి కుటుంబ సభ్యులను కూడా నీచంగా కామెంట్లు చేసిన వారిని అరెస్టు చేసినట్టు చెప్పారు.
వీరిలో వైసీపీ కీలక నాయకుడు, ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న వర్రా రవీందర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్‌లను మీడియా ముందుకు తీసుకువచ్చారు. వీరంతా కూడా సజ్జల భార్గవ రెడ్డి కనుసన్నల్లోనే పనిచేశారని తెలిపారు. ఆయన సూచ నల మేరకే రెచ్చిపోయారని, కడుపుకు అన్నంతినేవారు ఎవరూ ప్రవర్తించని విధంగా ప్రవర్తించారని తెలిపారు. చూసేందుకు, చదివేందుకు, వినేందుకు కూడా అసహ్యంగా ఉండే పదాలతో కామెంట్లుచేసినట్టు చెప్పారు. 2012 నుంచి సోషల్ మీడియాలో వీరంతా యాక్టివ్ గా ఉన్నట్టు తెలిపారు. అయితే.. సజ్జల భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు చేపట్టాక రెచ్చిపోవడం ప్రారంభించారన్నారు.
భార్గవరెడ్డి కళ్లలో ఆనందం కోసమే వీరు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, అనిత తదితరుల కుటుంబ సభ్యులను ఇష్టానుసారం కామెంట్లు చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రయోగించిన భాష అత్యంత జుగుప్సాక రంగా ఉందన్నారు. ఆడ బిడ్డలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని.. ఎవరినీ వదిలి పెట్టలేదన్నారు. వర్రా రవీంద్రారెడ్డి గతంలో భారతి సిమెంట్స్ కంపెనీలో పనిచేశాడని.. ఆ తర్వాత.. సోసల్ మీడియాలో యాక్టివ్ అయ్యారని డీఐజీ వివరించారు. 2020-22 మధ్య హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా కూడా పోస్టులు పెట్టారని.. తెలిపారు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్నట్టు చెప్పారు. వీరందరిపై ఐటీ చట్టం సహా.. ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేయనున్నట్టు వివరించారు.