అమెరికా ఎన్నికలు ముగిసాయి. ఫలితాలపై ఆసక్తి ఇంకా మిగిలే ఉంది. అసలే అగ్రరాజ్య ఎన్నికలు… ఆపైన హౌరా హౌరిగా సాగిన ఎన్నికల పోరాటం… విజయం ఎవరిని వరిస్తుందన్న ఆసక్తి అత్యంత సహజం. అయితే ఈ సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని అరుదైన సంఘటనలు అంతకు మించిన ఆసక్తినీ ఆలోచనలనూ రేకిత్తిస్తుండటం విశేషం. సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉండే శాస్త్రీయ సమాజం నుంచి ఈ సంఘటనలు వెలుగు చూడటం గమనార్హం. ఇందులో నోబెల్ గ్రహీతలతో సహా 81మంది శాస్త్రవేత్తలంతా కలిసి ”ట్రంప్‌ను ఓడించండి” అని పిలుపునివ్వడం ఓ విశేషం కాగా, తాజాగా పోలింగ్‌కు ముందు ప్రఖ్యాత సైన్స్ జర్నల్స్ సైతం అదే పిలుపు నివ్వడం మరో విశేషం! బహుశా ఇలాంటి సందర్భం ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిది కావొచ్చు!
”నేచర్”, ”సైంటిఫిక్ అమెరికన్”, ”న్యూ ఇంగ్లాండ్ జన్రలప్ మెడిసిన్” ఈ పత్రికలు ప్రపంచవ్యాపితంగా సైన్స్ కమ్యూనిటీలో ఎంత ప్రసిద్ధిగాంచినవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మూడు పత్రికలూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనల గురించి తప్ప ఎన్నడూ రాజకీయాల గురించి మాట్లాడిందిలేదు. అలాంటిది తమ తమ ఎడిటోరియల్స్‌లో, కాలమ్స్‌లో ట్రంప్‌ను ఓడించమని ప్రజలను కోరడమే కాదు, ఎందుకు ఓడించాలో కూడా స్పష్టం చేశాయి. ట్రంప్ శాస్త్ర విరుద్ధమైన పాలన ప్రగతికి ఆటంకమని కుండబద్దలు కొట్టాయి. ఇందుకు ఆధారాలతో సహా అనేక ఉదాహరణలు ప్రజలముందుంచాయి. ప్రత్యేకించి కరోనా నివారణలో సైన్స్ హెచ్చరికల్ని పూర్తిగా విస్మరించి వ్యవహరించిన ఫలితమే ఇప్పుడు అమెరికా అనుభవిస్తున్నదని పేర్కొన్నాయి. మాస్క్‌లు ధరించకపోవడం, భౌతికదూరాన్ని పాటించకపోవడం మొదలు ఏకానమీని ఓపెనప్ చేయడం వరకు ట్రంప్ అనుసరించిన బాధ్యతారాహిత్యాన్ని ఎండగట్టాయి.
ట్రంప్ విపత్తు ముంగిట శాస్త్ర విజ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయడమేకాదు, వారి ప్రఖ్యాత ”సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్” లాంటి సంస్థల హెచ్చరికల్ని కూడా పట్టించుకోలేదు. పైగా అమెరికా ప్రభుత్వం హాస్పటల్స్ అన్నింటికీ ”సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్”కు ఎలాంటి సమాచారం ఇవ్వొద్దనీ, నేరుగా డేటా మొత్తాన్ని అమెరికా ఆరోగ్యశాఖకు మాత్రమే పంపించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఎందుకంటే ఆ సంస్థ సైంటిఫిక్‌గా నిజాలను చెప్పి ప్రజలను అప్రమత్తం చేస్తుంది. అది ట్రంప్ వైఫల్యాలను ఎత్తిచూపడమే కాదు, అతని రాజకీయ ప్రయోజనాలకూ భంగం కలిగిస్తుంది. ప్రధానంగా వైరస్ తీవ్రత ప్రజలకు తెలిస్తే తను ఆర్థిక, ఉత్పాదక రంగాలలో కార్యకలాపాలను పునఃప్రారంభించడం పట్ల వ్యతిరేకత పెల్లుబుకుతుంది. అందుకే ట్రంప్ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి తన రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య మార్గాల్నీ ఆశాస్త్రీయ మార్గాల్నీ ఎంచుకున్నారు. కరోనా బాధితులకు శానిటైజర్స్ ఎక్కించండనే మూర్ఖపు వ్యాఖ్యలకు తెగబడ్డారు. ఒకవైపు శాస్త్రీయమైన వైద్య పరిశోధనలు జరుగుతుండగానే, మరోవైపు వాటితో సంబంధమే లేకుండా ఏకపక్షంగా నిరూపితం కాని డ్రగ్స్ (యాంటీ మలేరియల్, హైడ్రాక్సి క్లోరోక్విన్)ను అశాస్త్రీయంగా ప్రమోట్ చేశారు. ఇది ప్రజల పట్ల బాధ్యత గల నాయకుడు చేయగలిగే పనేనా?! దేశాధినేతలే ఇలా ఉంటే ఇక దేశమేమైపోతుంది. అందుకే ”శాస్త్ర విరుద్ధమైన ఈ అశాస్త్రీయ భావాల ట్రంప్‌ను ఓడించండీ” అని శాస్త్రవేత్తలు, సైన్స్ జర్నల్స్ ప్రజలను కోరాల్సిన అవసరమొచ్చింది. మరి అమెరికా ప్రజలు ఎలా స్పందించారో వేచి చూడాలి.
ట్రంప్‌ను ఆదర్శమూర్తిగా భావించే మోడీ పాలన కూడా ఇందుకు భిన్నంగా ఏమీలేదు. ఇంకా చెప్పాలంటే మరో అడుగు ముందుకేసి ఏకంగా మూఢత్వాన్నే ప్రబోధించారు మోడీ. దీపాలు వెలిగించమనీ, చప్పట్లూ తాళాలూ మోగించమనీ, మహాభారత యుద్ధమే పద్దెనిమిది రోజుల్లో ముగించిన వాళ్ళం, కరోనాపై యుద్ధాన్ని ఇరవై ఒక్కరోజుల్లో ముగిస్తామనీ డాంబికాలు పలుకుతూ ప్రజల్ని భ్రమల్లో ముంచి పబ్బం గడిపేశారు. ఇక ఆయన అనుయాయుల ఆవుమూత్రం, పేడనీళ్ల వంటి కరోనా నివారణోపాయాలకు లెక్కేలేదు. పైగా అనాలోచిత లాక్‌డౌన్‌తో కోట్లాది మంది వలస కార్మికుల ఉసురు తీసారు. అసంఖ్యాకులైన భారత ప్రజల ఉపాధిని బలితీసుకున్నారు. చివరికి ప్రజల ప్రాణాలను గాలికొదిలి, ట్రంప్‌ను మించిన అశాస్త్రీయ పోకడలతో కోవిడ్ కేసుల్లో దేశాన్ని అమెరికా తరువాత స్థానంలో నిలబెట్టారు.
అందుకే ”అశాస్త్రీయతను మెదళ్లలో నింపుకున్న నేతలు ఆధునిక సమాజ పురోగమనానికి ఆటంకం” అంటున్న శాస్త్రవేత్తల మాట అమెరికాకే కాదు, యావత్ ప్రపంచానికీ ఓ హెచ్చరిక. రేపు అమెరికా ఎన్నికల ఫలితాలు ఎలా అయినా ఉండొచ్చుగాక… సైన్స్ మాత్రం ఎప్పుడూ సత్యమే చెపుతుంది. ఆ సత్యానికి కట్టుబడి పురోగమిస్తూనే ఉంటుంది. సమాజ గమనానికి సైన్స్ టార్చ్‌లైట్ వంటిది.
ప్రగతి సాధనలో అమెరికా నుంచి ఆఫ్ఘనిస్థాన్ వరకు ప్రపంచమంతా ఆ వెలుగులో ప్రయాణించాల్సిందే. ప్రయాణమెప్పుడూ ముందుకే సాగాలని కోరుకుంటుంది సైన్స్. ముందుకు సాగితేనే అది ప్రగతి… మరి వెనుకకు నడిపించాలనే ప్రయత్నాలను అది ఎలా సహిస్తుంది? అందుకే శాస్త్రీయ సమాజం హెచ్చరిస్తోంది. ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తోంది. ఇది ఎంత త్వరగా గుర్తిస్తే సమాజం అంత త్వరగా వెలుగుదారి సాగుతుంది.