పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో `ఖుషి` ఒకటి. డైరెక్టర్ కమ్ స్టార్ యాక్టర్ ఎస్.జె. సూర్య తీసిన ఈ చిత్రం 2001లో విడుదలై సంచలన విషయాన్ని నమోదు చేసింది. పవన్ కళ్యాణ్ కు భారీ స్టార్డమ్ ను అందించింది. అయితే తాజాగా `ఖుషి 2` పై ఎస్.జె. సూర్య క్రేజీ అప్డేట్ ఇచ్చారు. గత కొన్నేళ్ల నుంచి ప్రతినాయక పాత్రలతో చెలరేగిపోతూ తెలుగు, తమిళ భాషల్లో మోస్ట్ బిజీయెస్ట్ నటుడిగా సత్తా చాటుతున్న ఎస్.జె. సూర్య.. ప్రస్తుతం `గేమ్ ఛేంజర్` ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా, ఎస్.జె. సూర్య విలన్ గా నటిస్తోంది.
సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా రేంజ్ లో గేమ్ ఛేంజర్ విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రీసెంట్ గా రాజమండ్రిలో నిర్వహించగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెస్ట్ గా హాజరై సందడి చేశారు. అయితే ఈ ఈవెంట్ లో ఎస్.జె. సూర్య గురించి పవన్ గొప్పగా చెప్పడమే కాకుండా పిలిచి మరీ హగ్ ఇచ్చారు. తాజా ఇంటర్యూలో ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న ఎస్.జె. సూర్య సంతోషంతో ఉప్పొంగిపోయారు. తన గురించి పవన్ మాట్లాడతుంటే గూస్ బంప్స్ వచ్చాయని.. ఆయన్ను హత్తుకున్నప్పుడు ఎంతో ఆనందం కలిగిందని సూర్య చెప్పుకొచ్చారు.
ఖుషి మూవీ టైమ్ లో ఎలా ఉన్నారో ఇప్పటికీ పవన్ అలానే ఉన్నారని.. నిజాయితీగా కష్టపడే వారిని ఆయన ఎప్పుడూ ప్రేమిస్తారని ఎస్.జె. సూర్య పేర్కొన్నారు. పవన్ తో ఖుషి 2 తీయాలని గతంలో అనుకున్నాను కానీ కుదరలేదు. ప్రస్తుతం నటుడిగా చాలా బిజీగా ఉన్నాను. దర్శకత్వం గురించి ఆలోచించట్లేదు. ఒకవేళ ఆ దేవుడు ఛాన్స్ ఇస్తే, టైమ్ కలిసి వస్తే అకీరా నందన్ ను హీరోగా పెట్టి ఖుషి 2 తీస్తానంటూ ఎస్.జె. సూర్య వ్యాఖ్యానించారు. పవన్ మాదిరిగానే అకీరా నందన్ కూడా పుస్తకాల పురుగు.. రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరాను ఫ్లైట్లో చూశానని ఈ సందర్భంగా సూర్య తెలిపారు. కాగా, సూర్య కామెంట్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఖుషి 2తో అకీరా సినీ ఎంట్రీ ఇస్తే బాక్సులు బద్దలవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.