భారత్ లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రష్యా సంచలన ఆరోపణలు చేసింది. అది కూడా అగ్రరాజ్యం అమెరికా మీద విమర్శలు చేయటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు.. ఖలిస్థానీ ఉగ్రవాది.. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంగ్ సింగ్ పన్నూ హత్య కుట్ర వెనుక భారతదేశం ఉందన్న వాదనలో నిజం లేదన్న రష్యా.. దానికి సంబంధించిన ఆధారాల్ని చూపించకపోవటాన్ని ప్రస్తావించింది. ఈ సందర్భంగా రష్యా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
భారత్ లో జరుగుతున్న ఎన్నికల్ని క్లిష్టతరం చేయటం.. అంతర్గత రాజకీయ పరిస్థితుల్ని అస్థిరపర్చాలన్న ప్రయత్నంపై రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలాన్ని రేపుతున్నాయి. అంతేకాదు.. గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు సంబంధించి ఇప్పటివరకు అమెరికా భారత్ కు ఎలాంటి సాక్ష్యాల్ని.. నమ్మదగిన ఆధారాల్ని అందించలేదని తమ వద్ద సమాచారం ఉందని రష్యా పేర్కొంది.
తగిన ఆధారాల్లేకుండా ఈ అంశాల మీద ఊహాగానాలు చేయటం ఆమోదయోగ్యం కాదన్న రష్యా.. అమెరికా తీరును తప్పు పట్టింది.
అంతేకాదు.. మత స్వేచ్ఛ విషయంలో భారత్ ఉల్లంఘనలకు పాల్పడుతుందంటూ కొద్ది రోజుల క్రితం అంతర్జాతీయ మతస్వేచ్ఛపై అమెరికా కమిషన్ రిపోర్టును ప్రస్తావించింది. ఈ నివేదికపై భారత్ సైతం తీవ్రంగా స్పందిస్తూ.. దాన్ని ఖండించింది. హోరాహోరీగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ రష్యా చేసిన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చగా మారింది.